నేడు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక…ఏ పార్టీ అభ్యర్థి పీఠంపై ఎక్కబోతున్నారు?

నేడు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక…ఏ పార్టీ అభ్యర్థి పీఠంపై ఎక్కబోతున్నారు?

GHMC Mayor, Deputy Mayor election : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు జరగబోయే మేయర్ వార్‌ త్రిముఖ పోరుగా మారింది. ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ మాత్రమే బరిలో ఉంటుందని భావించగా.. తాజాగా రేసులోకి ఎంఐఎం, బీజేపీలు కూడా వచ్చాయ్‌. మరి ఇవాళ మేయర్‌గా ఏ పార్టీ అభ్యర్థి పీఠంపై ఎక్కబోతున్నారు..? గ్రేటర్‌ మేయర్ నెంబర్ గేమ్‌ ఎలా ఉంది?గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అన్ని పార్టీల కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఇప్పటికే లిఖితపూర్వక సమాచారం ఇచ్చారు. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. టిఆర్ఎస్ పార్టీ తరపున 56 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు.. 32 మంది సభ్యుల ఎక్స్అఫిషియో బలం టిఆర్ఎస్ కు ఉంది. దీంతో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య మొత్తం 87కు చేరుకుంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసింది. టిఆర్ఎస్ ఎన్నికల విప్‌గా ఎమ్మెల్సీ ప్రభాకర్ ను నియమించారు. ఎన్నికల పర్యవేక్షకులుగా పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను నియమించారు. తెలంగాణ భవన్‌లో ఉదయం ఎనిమిదిన్నరకు విజయం సాధించిన పార్టీ కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన విధానాలను మంత్రులు నేతలకు వివరించనున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సభ్యులంతా గ్రేటర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. గ్రేటర్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తాము ఏ పార్టీ సహకారం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గెలుచుకుంటామని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ లో సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లతో వచ్చిన సీల్డ్ కవర్ ను గులబీ పార్టీ నేతలు ఓపెన్ చేసి అభ్యర్థులను ప్రకటిస్తారు

గ్రేటర్ మేయ‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టింది. టీఆర్ఎస్ పార్టీకి ఏక‌గ్రీవంగా మేయ‌ర్ పీఠం అప్పగించకుండా ఉండేందుకు మేయ‌ర్ రేసులో బరిలో దిగాల‌ని నిర్ణయించింది. బల్దియాలో బిజెపికి 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యుల బలంలో కలిపి 49 మంది బలం ఉంది. బీజేపీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలస్తోంది. బీజేపీ కూడా ఇప్పటికే కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది.

ఇటు మేయర్ పదవి కోసం ఎంఐఎం పార్టీ తన పార్టీ కార్యాలయం దారుసల్లాంలో భేటీ కానుంది. ఉదయం కొత్త కార్పొరేటర్లతో భేటీ అయిన తర్వాత మేయర్ ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. అయితే టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయాలా.. లేక డైరెక్ట్‌గా పోటీ చేయాలా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా.. 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఆ పార్టీకి ఉంది. దీంతో ఎంఐఎం సభ్యుల సంఖ్య సభలో 54 కు పెరగనుంది. మొత్తానికి మేయర్ సీటు ఎంపిక మాత్రం బల్దియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ ఎవరి పేరును ప్రకటిస్తుంది?. బీజేపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుంది?, మజ్లీస్ పార్టీ పొలిటికల్ ప్లాన్ ఏంటీ అనేది తేలనుంది.