నేడు టి. కేబినెట్ భేటీ, 13న శాసనసభ, 14న మండలి భేటీ

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 07:19 AM IST
నేడు టి. కేబినెట్ భేటీ, 13న శాసనసభ, 14న మండలి భేటీ

Today t. Cabinet meeting : సీఎం కేసీఆర్ అధ్యక్షతన 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం సాయంత్రం మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణలో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. GHMC చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు.. హైకోర్టు సూచిన చట్టాల్లో చేయాల్సిన మార్పులపై చర్చించనున్నారు.



అసెంబ్లీలో పెట్టే బిల్లులకు.. మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. 13వ తేదీ మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు శాస‌న‌స‌భ ప్రారంభం అవుతుంది. ఇక 14వ తేదీన బుధవారం ఉద‌యం 11 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లి ప్రారంభం కానుంది.



గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ మున్సి‌పల్‌ కార్పొ‌రే‌షన్‌ జీ‌హె‌చ్‌‌ఎంసీ చట్టాల్లో కొన్ని సవ‌ర‌ణలు చేయాల్సి ఉంది. అలాగే.. హైకోర్టు సూచించిన మరి‌కొన్ని అంశా‌ల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నం‌దున ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. గత నెల 16న శాస‌న‌సభ, మండలి సమా‌వే‌శా‌లు వాయిదా పడ్డాయి. కానీ, ప్రొరోగ్‌ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో గవ‌ర్నర్‌ అను‌మతి అవ‌సరం లేకుం‌డానే స్పీకర్‌, మండలి చైర్మన్‌లు సమా‌వే‌శా‌లపై నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసి సమా‌వే‌శా‌లను నిర్వహించే అవ‌కాశం ఉంది.



డిసెంబర్ చివరినాటికి హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఒకవేళ షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ కారణగా చట్టాలు చేయడానికి వీలు కాదు. ఈ క్రమంలో ఆ లోపే పలు కీలకమైన చట్టాలను ఆమోదింపజేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశపరుస్తోంది తెలంగాణ ప్రభుత్వం.



ఇక.. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేయాల్సి ఉంది. దీనికోసం శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.



తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం అవ్వడానికి ముందే మధ్యాహ్నం వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రామాల్లోనే పంటల కొనుగోలు అంశంపై కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. దాంతో పాటు లాభదాయకమైన పంటలను పండించే అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. యాసంగి పంటల సాగుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. రాష్ట్రం తరఫున ఎలా వ్యవహరించాలనే విషయంపైనా సీఎం కేసీఆర్ దృష్టి పెడుతున్నారు. కరోనా కారణంగా పంటల కొనుగోళ్లు, చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.