విషాదం..ఉదయం కొడుకు జననం..రాత్రి తండ్రి మరణం

  • Edited By: murthy , August 9, 2020 / 09:08 AM IST
విషాదం..ఉదయం కొడుకు జననం..రాత్రి తండ్రి మరణం

పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట  జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా కోర్టుకు సెలవులు ప్రకటించటంతో స్వగ్రామం వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతని భార్య అతని భార్య సౌమ్య గర్భిణి కావడంతో గురువారం ఆమెను చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కోసం చేర్పించారు.

శ్రీనివాస్‌కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోటానికి  సిద్దిపేట వెళ్లాడు. రాత్రి కావడంతో సిద్దిపేట బస్‌స్టేషన్‌లోనే నిద్రపోయాడు. శుక్రవారం ఉదయాన్నే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అటు చేర్యాల ఆస్పత్రిలో చేరిన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది.

సిద్దిపేటలో  శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత కన్నుమూశాడు. కాగా శ్రీనివాస్‌ కు వైద్యులు కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్‌  వచ్చింది. కాగా, ఉదయం జన్మించిన కుమారుడిని చూడకుండానే తండ్రి అకస్మాత్తుగా మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

శ్రీనివాస్‌ రెండేళ్ల క్రితమే సౌమ్యను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. రెండు నెలల క్రితం  శ్రీనివాస్‌ సోదరుడు మరణించగా, ఇప్పడు శ్రీనివాస్ మరణించటంతో ఆ ఇంట్లో విషాదం అలుముకున్నది.