Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? | TRS cadre worried about the two vacant Rajya Sabha seats from Telangana and the candidates for the by-election seat

Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?

రాజ్యసభ సీట్ల కోసం టీఆర్‌ఎస్‌లో ఎంతోమంది ఆశావహులు పోటీపడుతున్నా రెండు సీట్లు మాత్రం అగ్రవర్ణాలవారికి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?

Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న రెండుస్థానాలకు తోడు ఉప ఎన్నిక జరగనున్న స్థానానికి అభ్యర్థులెవరనే ఉత్కంఠ టీఆర్‌ఎస్‌లో కొనసాగుతోంది. ఈ మూడు స్థానాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏకగ్రీవం కానున్నాయి. దీంతో గులాబీపార్టీలో ఆశావహుల లిస్ట్‌ భారీగా ఉంది. రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయన్న చర్చ అధికారపార్టీలో జోరుగా జరుగుతోంది. మరో స్థానానికి అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోందని టాక్‌ వినిపిస్తోంది. ఉప ఎన్నిక జరిగే స్థానానికి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సమీపిస్తోంది. ఈ స్థానానికి రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండడంతో సీనియర్‌ నేతలు అంతగా ఆసక్తి చూపట్లేదని సమాచారం.

గతంలో రాజ్యసభ సీట్ల భర్తీ సమయంలో టీఆర్‌ఎస్‌లో ఇద్దరి పేర్లు చివరి నిమిషం వరకు గట్టిగా వినిపించాయి. అయితే అప్పటి పరిస్థితుల్లో వారికి అవకాశం ఇవ్వలేకపోయారు కేసీఆర్. దీంతో ఈసారి ఆ ఇద్దరినీ పెద్దల సభకు పంపించేందుకు కేసీఆర్‌ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌ కోశాధికారిగా వ్యవహరించిన దామోదర్‌రావు, పారిశ్రామికవేత్త-హెటిరో సంస్థ అధినేత పార్ధసారథిరెడ్డి…ఈ ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమనేంతగా గులాబీశ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

Telangana : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు..ఎంపీ, ఎమ్మెల్సీలతో టెన్షన్..అసలు విషయం ఏమిటంటే..

రాజ్యసభకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పంపిస్తారనే ప్రచారం జరిగింది కానీ.. కేటీఆర్‌తో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమై…తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ సానుకూలంగా స్పందించడంతో పెద్దల సభకు పొంగులేటి వెళ్లనట్లే అని స్పష్టమవుతోంది. పొంగులేటికి బ్రేక్‌ పడడంతో…అదే సామాజికవర్గం, ఆయన జిల్లాకే చెందిన పారిశ్రామికవేత్త పార్ధసారథిరెడ్డికి లైన్‌ క్లియర్‌ అవుతుందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.

రాజ్యసభ సీట్ల కోసం టీఆర్‌ఎస్‌లో ఎంతోమంది ఆశావహులు పోటీపడుతున్నా రెండు సీట్లు మాత్రం అగ్రవర్ణాలవారికి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. మూడో సీటును బీసీ లేదా ఎస్సీ నేతలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గంలో నారదాసు లక్ష్మణ్‌రావు, పి.ఎల్‌.శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న ప్రకాశ్‌ రాజ్‌కు అవకాశం ఉంటుందని గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు రేస్‌లో ఉన్నారు.

Telangana : పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ నుంచి పిలుపు..‘రాజ్యసభకు పంపుతారా?’..

జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్‌.. బీజేపీ టార్గెట్‌గా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌కు లైన్‌ క్లియర్‌ చేస్తారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా సీఎం కేసీఆర్‌తో వ్యవసాయ క్షేత్రంలోనే ప్రకాశ్‌రాజ్‌ గడుపుతుండడంతో ఆయనకు టికెట్‌ కన్‌ఫర్మ్‌ అవుతుందనే ప్రచారం మరింతగా ఊపందుకుంటోంది.

రెండేళ్ల పదవీకాలం ఉండే రాజ్యసభ సీటును ప్రకాశ్‌రాజ్‌ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా టీఆర్‌ఎస్‌లో వినిపిస్తోంది. మూడు రాజ్యసభ స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్‌ నేతలు భావిస్తున్నారు. దాదాపు రెండు స్థానాలకు అభ్యర్థులపై స్పష్టత రావడంతో..మరో స్థానం ఎవరికి దక్కనుందనేదానిపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

×