కారు క్యాంపెయిన్ : కేటీఆర్ రోడ్ షోలు, క్లైమాక్స్‌లో కేసీఆర్ బహిరంగ సభ!

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 12:07 AM IST
కారు క్యాంపెయిన్ : కేటీఆర్ రోడ్ షోలు, క్లైమాక్స్‌లో కేసీఆర్ బహిరంగ సభ!

TRS Campaign, KTR Roadshow : 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున అంతా తానై నడిపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. సుడిగాలి పర్యటనలు చేసి.. కారు జోరుకి తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు కేటీఆర్‌. 20 నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించాలని హైకమాండ్‌ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్‌ సభతో కారుకి ఫుల్‌ మైలేజ్‌ ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు లెక్కలేసుకుంటున్నాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని డిసైడైంది గులాబీ దళం. ఇప్పటికే డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు పూర్తి చేసింది.



ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సీన్‌లోకి ఎంటర్‌ అయితే మరింత కలిసొస్తుందని భావిస్తోంది. ఇందులో భాగంగా రోడ్‌ షోలకు గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్ చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. అదే స్పీడ్‌తో ప్రచారంలోనూ దూసుకుపోవాలనుకుంటోంది. రోజుకు నాలుగు నుంచి ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 2016 గ్రేటర్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో దాదాపు 20 నియోజకవర్గాలను కవర్ చేశారు కేటీఆర్‌. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రోడ్‌ షోలకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తోంది టీఆర్‌ఎస్‌.



గ్రేటర్ ఎన్నికల్లో రోడ్ షోల కోసం మంత్రి కేటీఆర్ ప్రచార రథం సిద్ధమైంది. తెలంగాణ భవన్‌లో ప్రచార రథానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరానికి ఈశాన్య భాగం నుంచి రోడ్ షో ప్రారంభించే అవకాశం ఉంది. కుత్బుల్లాపూర్ లేదంటే మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేటీఆర్‌ క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ఛాన్సెస్‌ ఉన్నాయి. స్థానిక నేతలతో కలిసి ఒక్కోచోట కనీసం రెండు నుంచి మూడు వేల మందిని రోడ్ షో లకు తరలించాలని పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రచారానికి గడువు ముగిసేలోగా 90 నుంచి 120 రోడ్ షో లు జరుగుతాయని పార్టీ నేతలు అంచనాగా కనిపిస్తోంది.



ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ప్లాన్ చేస్తోంది. ఈ సభలో సీఎం కేసీఆర్‌ ఒక్కరే పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారం క్లైమాక్స్‌లో జరిగే సభతో పార్టీకి ఫుల్ మైలేజ్ వస్తుందని నేతలు లెక్కలేసుకుంటున్నారు.