CM KCR: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా.. ఈనెల 18న హైదరాబాద్‌లో TRS ధర్నా

తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 18న మహాధర్నా చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

CM KCR: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా.. ఈనెల 18న హైదరాబాద్‌లో TRS ధర్నా

Kcr Paddy

CM KCR: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. లేదా.. అన్నది స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రంతో పాటు.. బీజేపీ నేతల తీరుకు నిరసనగా.. ఈ నెల 18న ధర్నా చేయబోతున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా హాజరవుతారన్నారు. ఆ ధర్నా తర్వాత 2 రోజులు కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తామని చెప్పారు. ఆ తర్వాత.. రైతులు ఏ పంట వేయాలన్నదానిపై స్పష్టత ఇస్తామన్నారు.

రాష్ట్ర రైతులు వరి వేయాలంటూ చెప్పిన మాటపై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలబడతాడా లేదా.. అని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. తప్పు ఒప్పుకొని రాష్ట్ర రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే.. రైతులు బీజేపీని క్షమించబోరని హెచ్చరించారు. 18న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ధర్నా చేసి.. తర్వాత గవర్నర్ కు మెమోరాండం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర రైతుల ప్రయోజనం కోసం ఎంతకైనా వెళ్తామని.. ప్రజలను రైతులను కాపాడుకుంటామని చెప్పారు. పంజాబ్ రైతులు పండించిన ధాన్యాన్ని కొన్నట్టు.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొంటుందా.. లేదా తేల్చి చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్రం వైఖరి రాష్ట్రానికో తీరు.. పూటకో నీతి అన్నట్టు ఉందని కేసీఆర్ విమర్శించారు. పంజాబ్ విషయంలో చేసిన పని.. తెలంగాణ విషయంలో ఎందుకు కాదని ప్రశ్నించారు. ఈ గందరగోళానికి తెర దించేందుకు.. తాను స్వయంగా పార్టీ సీనియర్లను తీసుకుని కేంద్ర మంత్రిని కలిశానని కేసీఆర్ చెప్పారు. సరిగ్గా స్పందన రాకుంటే.. తాను ఢిల్లీలోనే ఉంటానని చెప్పి.. అధికారులతో సమావేశం ఏర్పాటు కూడా చేయించినట్టు తెలిపారు. ఇప్పటికి 50 రోజులు పూర్తయినా.. కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలుపై ఎలాంటి స్పష్టత రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ రైతులను రెచ్చగొడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. అసలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే తప్పేంటన్నారు. టీఆర్ఎస్ కు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారని.. అందులో చాలా మంది రైతులు ఉంటారని చెప్పిన కేసీఆర్.. బండి సంజయ్ తీరు మాత్రం బాగాలేదన్నారు. యాసంగిలో వరి వేయాలని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై.. బీజేపీ నాయకులు వైఖరి ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. వరి వేయాలని చెప్పిన బండి సంజయ్ తీరును ప్రజలు కచ్చితంగా ప్రశ్నిస్తారని.. ఇవాళ జనంలోకి వెళ్లిన సంజయ్ కు అదే పరిస్థితి ఎదురైందని స్పష్టం చేశారు.

తలా తోకా లేకుండా మాట్లాడితే ఇలాంటి ఫలితాలే వస్తాయన్నారు. కేంద్రం తీరు కూడా.. అలాగే ఉందని ఆరోపించారు. ప్రభుత్వంగా తాము ఏం చెప్పామో.. అవన్నీ చేశామని.. బీమా, రైతుబంధు, ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి.. ఇచ్చి చూపించామని అన్నారు. కేంద్రం తీరును, బీజేపీ నేతల వైఖరిని.. తెలంగాణ ప్రజలు వెంటాడి తీరుతారని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని.. తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.. కేసీఆర్.