ఉప్పల్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డుకుంటాం…ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

10TV Telugu News

MLA Danam Nagender sensational comments : ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్‌లో జరగబోయే ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లను అడ్డుకుంటామన్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి దానం వార్నింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ క్రీడాకారులు లేకుండా..సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరుతో ఐపీఎల్ నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఐపీఎల్ వేలంలో హైదరాబాద్‌తో పాటు తెలుగు క్రికెట్ క్రీడాకారులను తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలంలో హైదరాబాద్‌ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందన్నారు.

ఐపీఎల్‌లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారన్నారు. హైదరాబాద్ క్రీడాకారుడు లేకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. సన్‌ రైజర్స్ ఇప్పటికైనా తన తప్పును దిద్దుకోవాలన్నారు. లేకపోతే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ పేరును మార్చుకోవాలని సూచించారు. తెలుగు ఆటగాళ్లను తీసుకోకపోతే ఫ్రాంచైజీ పేరు మార్చుకోవాలని సూచించారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో దొరికిపోయిన డేవిడ్‌ వార్నర్‌..హైదరాబాద్‌ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండటం దురదృష్టకరమన్నారు. ముంబై పేరుతో ఉన్న టీమ్‌లో ముంబై ఆటగాడైన సచిన్‌ కుమారుడిని తీసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ పేరుతో ఉన్న టీమ్‌లో ఒక్క హైదరాబాద్‌ ఆటగాడైనా ఉండాలన్నారు.