TRS Leaders : పదవులే పదవులు, ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

గులాబీ నేత‌ల‌కు ఈ ఏడాది భారీగా ప‌ద‌వులు ద‌క్కనున్నాయి. రాబోయే రెండు నెల‌ల్లో ఏడుగురు శాస‌న‌మండ‌లి స‌భ్యుల ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది.

TRS Leaders : పదవులే పదవులు, ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

Trs

Legislative Council Posts : గులాబీ నేత‌ల‌కు ఈ ఏడాది భారీగా ప‌ద‌వులు ద‌క్కనున్నాయి. రాబోయే రెండు నెల‌ల్లో ఏడుగురు శాస‌న‌మండ‌లి స‌భ్యుల ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది. ఈ ఏడాది చివ‌రి నాటికి స్థానిక సంస్థల మండ‌లి స‌భ్యుల ప‌ద‌వీ కాలం కూడా పూర్తికానుంది. దీంతో మండ‌లిలో ఖాళీ అయ్యే దాదాపు మూడో వంతు స్థానాల‌పై గులాబీ నేత‌లు భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. శాస‌న‌స‌భ్యుల కోటా, గ‌వ‌ర్నర్ కోటాలో ఏడు మండ‌లి స్థానాలకు జూన్ నెలాఖ‌రుకు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న నేత‌ల‌ను ప‌రిశీలిస్తే.. మండ‌లి చైర్మన్ గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగ‌ర్, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి, చీఫ్ విప్ బోడకుంటి వెంక‌టేశ్వర్లు, ఆకుల ల‌లిత‌, ఫ‌రీదుద్దీన్, గ‌వ‌ర్నర్ కోటాలో శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వీకాలం త్వర‌లో ముగియ‌నుంది.

రాబోయే మూడు నెలల్లో ఈ స్థానాలు భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉండ‌డంతో నేత‌లు పెద్ద ఎత్తున ఆశ‌లు పెంచుకున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌లుగా కొన‌సాగుతున్నవారిలోనూ.. మ‌రోసారి త‌మ‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న దీమా క‌నిపిస్తోంది. అయితే సీఎం కేసీఆర్.. ఎంతోమంది నేత‌ల‌కు మండ‌లికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చార‌న్న అంశాన్ని ప‌లువురు నేత‌లు తెర‌పైకి తెస్తున్నారు. హామీలు పొందిన నేత‌లు.. పార్టీలో ఉద్యమ స‌మ‌యం నుంచి ప‌నిచేసిన నేత‌లు కూడా ఎంతోమంది ప‌ద‌వులపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఉమ్మడి న‌ల్గొండ, వ‌రంగ‌ల్ జిల్లాల‌ నుంచి ప్రస్తుతం ఇద్దరిద్దరు నేతలు ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో.. వారిలో ఒక్కొక్కరికి మాత్రమే ఈసారి ప‌ద‌వి వ‌రించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఉమ్మడి మెద‌క్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఫ‌రీదుద్దీన్‌కు మైనార్టీ కోటాలో మ‌రోసారి అవ‌కాశం ద‌క్కుతుందా లేదా అన్నది ఆస‌క్తి రేపుతోంది. ఆకుల ల‌లిత‌కు సామాజిక‌వ‌ర్గం క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న ప్రచారం జ‌రుగుతోంది. గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న శ్రీ‌నివాస్‌రెడ్డికి వ‌యోభారం కార‌ణంగా ఈసారి అవ‌కాశం దక్కకపోవచ్చని అధికార పార్టీ నేత‌ల్లో చర్చ జ‌రుగుతోంది. గ‌వ‌ర్నర్ కోటాలో ప‌ద‌వీ కాలం పూర్తయిన మాజీ ఎమ్మెల్సీ క‌ర్నె ప్రభాక‌ర్, సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు రావుల శ్రవ‌ణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎల్పీ కార్యద‌ర్శి ర‌మేశ్‌రెడ్డిలకు ఈ విడ‌త ఛాన్స్‌ ద‌క్కవ‌చ్చని పార్టీలో ప్రచారం జ‌రుగుతోంది.

స్థానిక సంస్థల కోటాలో హైద‌రాబాద్ మినహా అన్ని స్థానాల‌కు స్థానిక సంస్థల కోటాలో ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌రగనున్నాయి. తొమ్మిది ఉమ్మడి జిల్లాల నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వారిలో మెజార్టీ నేత‌ల‌కు మ‌రోసారి పార్టీ రంగంలోకి దించే అవ‌కాశం ఉంది. ఒక‌టి రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు జ‌రిగే అవ‌కాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ ఏడాది మండ‌లిలో 16 స్థానాలు భ‌ర్తీ కానుండ‌డంతో.. నేత‌లు త‌మ లక్కును పరీక్షించుకునే పనిలో పడ్డారు.