TRS MP Nama : విచారణకు సహకరిస్తా-నామా నాగేశ్వరరావు

తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాజీవితంలో ఉండటంతో మధుకాన్ దాని అనుబంధ సంస్ధలను మా సోదరులు చూసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు చెప్పారు.

TRS MP Nama : విచారణకు సహకరిస్తా-నామా నాగేశ్వరరావు

Trs Mp Nama Nageswara Rao Press Meet On Cbi Raids

TRS MP Nama Nageswara Rao : తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాజీవితంలో ఉండటంతో మధుకాన్ దాని అనుబంధ సంస్ధలను మా సోదరులు చూసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ఇటీవల రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి బ్యాంకుల నుంచి తీసుకున్న  రుణాలను విదేశాలకు తరలించారనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయన ఇళ్ళలోనూ, సంస్ధ డైరెక్టర్లు, ఇతర కార్యాలయాల్లో  సాదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో నామా నాగేశ్వరరావు ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. మధుకాన్‌కు సంబంధించిన ఏ కంపెనీలోనూ నేను డైరెక్టర్ని కాదు అని తెలిపారు.  న్యాయవ్యవస్ధ పట్ల తనకు నమ్మకం ఉందని, నేను ఎవర్నీ మోసం చేయలేదని, సీబీఐ అధికారులకు విచారణకు సహకరిస్తానని చెప్పారు.

తమ సంస్ధ ఎన్నో ప్రత్రిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసిందని.. కొంకణ్ రైల్వేలో ముంబై-మంగళూరు మార్గంలో 6శాతం పనులు మధుకన్ కంపెనీలు వేశాయని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు   చైనా బోర్డర్‌లో  అత్యంత ప్రమాదకరమైన చోట్ల, ఎవ్వరూ వెళ్లలేని చోట్ల  కూడా మా సంస్ధలు రోడ్లు వేస్తున్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చి రెండు సార్లు ఎంపీగా గెలిచి ప్రజాజీవితంలో ఉండటంతో, కంపెనీల బాధ్యతలు మా తమ్ముళ్లకు అప్పగించానని ఆయన చెప్పారు.

ఇటీవల సీబీఐ సోదాలు నిర్వహించిన రాంచీ ఎక్సప్రెస్ హైవే ప్రాజెక్టు సంబంధించి 163 కిలోమీటర్లు, 30 శాతం ఈక్విటీ 70 రుణంతో ప్రాజెక్ట్ నిర్మాణం 2011 లో ప్రారంభించాం. నేషనల్ హైవే అధారిటీతో అగ్రిమెంట్ అయినప్పుడు 80 శాతం సైట్ అప్పగించాలి. తర్వాత 3 నెలలలో మొత్తం సైట్ ఇవ్వాలి. అనేక కారణాల వల్ల ఎన్‌హెచ్ఏ సైట్ ఇవ్వలేక పోయిందని ఆయన వివరించారు. వాళ్లు ఇచ్చిన సైట్ లో, ఇచ్చినట్లు 90 శాతం పనులు పూర్తిచేశామని ఆయన చెప్పుకొచ్చారు.

సీబీఐ  కేసు  విషయంలోకి వెళితే….2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్‌– జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్‌ హైవే–33 పనులను మధుకాన్‌ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్‌ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది.

తర్వాత మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. విచారించాలని  సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) న్యూఢిల్లీని  జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.  మధుకాన్‌ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై  కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్‌  చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.  అందులో భాగంగానే సీబీఐ అధికారులు నామా ఇంట్లో,కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.