ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, భూమి కేటాయించిన కేంద్రం

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 06:46 AM IST
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, భూమి కేటాయించిన కేంద్రం

TRS party office in Delhi : త్వరలోనే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌కు భూమి కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలో శంకుస్థాపన చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వీలైతే దసరా పండుగ రోజే శంకుస్థాపన చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.



కార్యాలయ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. పార్టీ ఎంపీల సంఖ్య ఆధారంగా భూకేటాయింపులను కేంద్రం ప్రభుత్వం చేస్తోంది. ఈ నిబంధనలతో 550 చదరపు మీటర్ల స్థలం ఉన్న రెండు ప్లాట్‌లను టీఆర్‌ఎస్‌కు కేటాయించింది కేంద్రం.



మొత్తం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయిస్తూ.. సీఎం కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. ఎకరాకు దాదాపు 26 కోట్ల రూపాయలుగా ఖరారు చేస్తూ కేటాయింపు జరిపినట్లు లేఖలో పేర్కొంది. ఈ భూమికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను కేంద్రానికి టీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సి ఉంటుంది.



దీనికి తోడు కేటాయించిన భూమికి వార్షిక అద్దె కింద 2.5 శాతం చెల్లించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొంది కేంద్రం. దాదాపు 20 లక్షలకు పైగా రూపాయలను ఈ భూమి అద్దె కోసం టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది.



భూ కేటాయింపు జరుపుతూ ఉత్తర్వులు వెలువడడంతో.. త్వరలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు పార్టీ అధినేత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దసరా రోజే తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారు. ఢిల్లీ భూ కేటాయింపులకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తయితే.. దసరా రోజునే ఢిల్లీలో పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేసేందుకు కేసీఆర్‌ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీకి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపించి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.



దసరా పండుగ లోపు అన్ని అనుమతులు వస్తే పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను మొదలు పెట్టాలని అధికార పార్టీ యోచిస్తోంది. రాష్ట్రంలో పార్టీ చేపట్టిన కార్యాలయాల నిర్మాణాలు దాదాపు పూర్తవడంతో.. దసరా రోజునే కొత్త పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు టీఆర్ఎస్‌ పార్టీ సిద్ధమవుతోంది.