ప్రోగ్రెస్ రిపోర్టు Vs ఛార్జ్ షీట్ : వాళ్ల రిపోర్ట్ ఏంటి.. వీళ్ల రియాక్షనేంటి?

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 01:08 AM IST
ప్రోగ్రెస్ రిపోర్టు Vs ఛార్జ్ షీట్ : వాళ్ల రిపోర్ట్ ఏంటి.. వీళ్ల రియాక్షనేంటి?

TRS Progress Report Vs BJP Charge Sheet : హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి.. టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్‌గా బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి గులాబీ రిపోర్ట్ చెబితే.. మీరు చెప్పిందేంటి.. చేసిందేంటని.. బీజేపీ ఛార్జ్ షీట్‌ కౌంటర్ వేసింది. ఇంతకీ.. వాళ్ల రిపోర్ట్ ఏంటి.. వీళ్ల రియాక్షనేంటి? గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి… టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్, బీజేపీ చార్జ్ షీట్‌లో చాలా అంశాల గురించి ప్రస్తావించారు. ఆరేళ్లలో ఏం చేశారో టీఆర్ఎస్ చెబితే.. మీరు ఒకటి చేస్తామని మరొకటి చేశారంటూ.. బీజేపీ కౌంటర్ వేసింది. మినిస్టర్ కేటీఆర్ రిలీజ్ చేసిన.. హైదరాబాద్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌కు కౌంటర్‌గా.. బీజేపీ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ ఇప్పుడు గ్రేటర్‌లో హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ.. వాళ్లేం చెప్పారు.. వీళ్లేమంటున్నారు ?



హైదరాబాద్ అభివృద్ధి :-
మొదటగా.. హైదరాబాద్ అభివృద్ధి విషయానికొస్తే.. ఈ ఆరేళ్లలో నగరాన్ని డెవలప్ చేయటానికి.. 67 వేల 149 కోట్లకు పైనే ఖర్చు చేశామని టీఆర్ఎస్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలిపింది. దీనికి.. బీజేపీ కౌంటర్ వేసింది. 67 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రోడ్ల మీదకు నీళ్లెందుకొచ్చాయని.. తమ ఛార్జ్ షీట్‌లో నిలదీసింది. అంతేకాదు.. వేల కోట్లు ఖర్చు చేస్తే.. డ్రైనేజీలు ఎందుకు పొంగిపొర్లుతున్నాయని ప్రశ్నించింది. 67 వేల కోట్లను.. ఎక్కడ ఖర్చు చేశారు.. ఏ బస్తీలో ఖర్చు చేశారని అడిగారు. టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తప్పుల తడక అని రాసుకొచ్చారు.




మెట్రో రైలు :-

మెట్రో రైల్ విషయానికొస్తే.. హైదరాబాద్ మెట్రో కోసం 17 వేల 290 కోట్లు ఖర్చు చేశామని టీఆర్ఎస్ చెప్పింది. ఛార్జ్ షీట్‌లో.. దీనికి కూడా బీజేపీ కౌంటర్ వేసింది. 17 వేల కోట్లు ఖర్చు చేసి.. ఓల్డ్ సిటీ దాకా మెట్రో లైన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఏడాదిలో.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా రూట్ పూర్తి చేస్తామని చెప్పి.. పనులు ఎందుకు మొదలుపెట్టలేదని అడిగింది. ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో లైన్ వేస్తామన్న మాటలు ఏమయ్యాయని ఛార్జ్ షీట్‌లో క్వశ్చన్ చేశారు.




డబుల్ బెడ్ రూం:-

డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయానికొస్తే.. 9 వేల 7వందల కోట్లతో 111 ప్రాంతాల్లో.. నిరుపేదలకు లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు.. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలిపింది టీఆర్ఎస్. ఛార్జ్ షీట్‌లో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించింది బీజేపీ. లక్ష బెడ్ రూం ఇండ్లని చెప్పి.. 11 వందల గృహప్రవేశాలా అని ప్రశ్నించింది. చెప్పిన లక్షకు.. కట్టిన ఇండ్ల సంఖ్యకు ఏమైనా పొంతన ఉందా అని అడిగారు. 20 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు.



హైదరాబాద్ రోడ్లు :-
హైదరాబాద్ మహానగరంలో రోడ్ల అభివృద్ధి విషయానికొస్తే.. 14 వేల 738 కోట్లతో గ్రేటర్ పరిధిలో రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపింది టీఆర్ఎస్. SRDP, HRDCL, CRMP, ORR కింద మేజర్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. దీనికి స్పందించిన బీజేపీ.. 20 వేల కోట్లతో అందుబాటులోకి తెస్తామన్న SRDPలో.. 25 శాతం పనులు కూడా పూర్తిచేయలేదని ఆక్షేపించింది. మూసీపై నిర్మిస్తామన్న 6 లేన్ల రోడ్డుకు ప్రణాళిక? సిటీని.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ చేస్తామన్న హమీ.. సిటీలో వేస్తామన్న వైట్ ట్యాప్ రోడ్లు ఎక్కడ అని ప్రశ్నించింది కమలం పార్టీ.



నీటి సరఫరా :-
నగరంలో నీటి సరఫరాపైనా.. బీజేపీ కౌంటర్ వేసింది. 14 వేల 175 కోట్లతో వాటర్ సప్లై, సీవేజ్ ప్లాంట్లు చేపట్టామన్నారు. రక్షిత మంచినీటిని అందరికీ అందిస్తున్నామని చెప్పారు. అయితే.. రాచకొండ, శామీర్‌పేటలో నిర్మిస్తామన్న రిజర్వాయర్లు ఏమయ్యాయ్? అని అడుగుతోంది బీజేపీ. నగరంలో ఇస్తామన్న 32 వేల నల్లా కనెక్షన్ల సంగతేంటని ప్రశ్నిస్తోంది. నల్లాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 25 శాతం మందికే కనెక్షన్లు ఇచ్చారని.. మిగతావాళ్లంతా.. ఇంకెంతకాలం ఎదురుచూడాలని క్వశ్చన్ చేశారు.



బస్తీ దవాఖానాలు :-
హైదరాబాద్ లో 30 కోట్లకు పైగా ఖర్చుతో.. 250కి పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. టీఆర్ఎస్ తన ప్రోగ్రెస్ రిపోర్టులో తెలిపింది. రోజుకు.. 85 నుంచి వంద రోగులు సందర్శిస్తున్నారని చెప్పారు. దీనికి కూడా బీజేపీ కౌంటర్ వేసింది. నిమ్స్ తరహాలో.. హైదరాబాద్‌ నలుదిక్కులా నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏమయ్యాయ్ అని ప్రశ్నించింది. ఐదేళ్లు గడిచినా.. ఒక్క హాస్పిటల్ నిర్మించలేదని విమర్శించింది.



ఉద్యోగ, ఉపాధి కల్పన :-
టీఆర్ఎస్ హయాంలో.. హైదరాబాద్‌కు 2లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు కేటీఆర్. దీంతో.. 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన దొరికినట్లైందని.. టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెబుతోంది. దీంతో.. ఇప్పటిదాకా టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎన్ని నియమకాలు చేపట్టారని బీజేపీ ఛార్జ్ షీట్ అడుగుతోంది. 18 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని.. జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏమైందని నిలదీసింది. టాస్క్ ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించింది. టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్, బీజేపీ ఛార్జ్ షీట్‌లో.. ఇంకా చాలా విషయాలపై ప్రస్తావించారు. ఈ రెండు రిపోర్టులు.. ఇప్పుడు.. గ్రేటర్ ఎన్నికల్లో కీలకంగా మారాయి.