దుబ్బాకలో టీఆర్ఎస్ దే పక్కా విజయం – హరీష్ రావు

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 01:14 PM IST
దుబ్బాకలో టీఆర్ఎస్ దే పక్కా విజయం – హరీష్ రావు

TRS victory : దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం పక్కా అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ విజయాలకు ఎవరూ బ్రేక్‌ వేయలేరన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాకలోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఆయన పర్యటించారు.



ఈ సందర్భంగా బీజేపీకి చెందిన పలువురు నేతలు హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమన్నారు.



ప్రతిపక్షాలవి మేకపోతుగాంభీర్యాలేనని, ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. గ్లోబల్స్ ప్రచారం చేస్తూ..అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కానీ..ప్రజలు తెలివైన వారని, హుజూర్ నగర్, నిజామాబాద్ ఎన్నికల్లో చూపించారని తెలిపారు. అలాగే..దుబ్బాకలో కూడా చూపిస్తారని మంత్రి హరీష్ తెలిపారు.



నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా కవిత విజయ పతాకం ఎగరవేశారు. ఇక్కడ మొత్తం ఓట్లు 824 ఉండగా.. ఒక్క ఓటు మినహా 823 ఓట్లు పోలయ్యాయి.



అందులో 728 ఓట్లు కవితకు రాగా.. బీజేపీ అభ్యర్థికి 56, కాంగ్రెస్‌ అభ్యర్థికి 29 ఓట్లు మాత్రమే వచ్చాయి. పది ఓట్లు చెల్లకుండాపోయాయి. ఇక్కడ కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తిరుగులేని విజయం సాధించిన కవిత.. ఈనెల 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.