జగిత్యాల ఖిల్లాపై బీజేపీ ఫోకస్ : కారు స్పీడ్ కు బ్రేక్ పడుతుందా, ఏ పార్టీది పై చేయి

జగిత్యాల ఖిల్లాపై బీజేపీ ఫోకస్ : కారు స్పీడ్ కు బ్రేక్ పడుతుందా, ఏ పార్టీది పై చేయి

TRS Vs BJP Politics In Jagtial District : ఆ జిల్లాలో కాంగ్రెస్‌ కుదేలయ్యింది. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. కానీ ఇప్పుడదే జిల్లాలో బీజేపీ దూకుడు మొదలెట్టింది. కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు కమలనాథులు రెడీ అవుతుంటే.. వారి ఎత్తుగడలను చిత్తు చేసేందుకు గులాబీదళం ఢీ అంటోంది. జగిత్యాల జిల్లాలో జరుగుతున్న ఆ రాజకీయ రగడమేంటో, ఏ పార్టీది పై చేయిగా ఉందో ?  జగిత్యాల జిల్లాలో కార్‌ స్పీడ్‌కు బ్రేక్‌ పడుతుందా? రాజకీయ జగడంతో కమలం వికసిస్తుందా అనే చర్చ ఇప్పుడు రచ్చ చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు..టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా ఉన్న నియోజకవర్గాలపై ముఖ్యంగా దృష్టి సారించారు.

రైతు ఉద్యమాలు కీలకం : –
ఇందులో భాగంగానే జగిత్యాల ఖిల్లాను బీజేపీ టార్గెట్‌ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ జెండాను ఎగురేయడానికి ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారట. జగిత్యాల జిల్లా రాజకీయాలను రైతు ఉద్యమాలు ప్రభావితం చేస్తుంటాయి. గతంలో జరిగిన రైతు ఉద్యమాలతో సంభవించిన మార్పులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంది. దీంతో అక్కడ నేతల రాజకీయ భవిష్యత్తు ఇక్కడ రైతులపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి జగిత్యాల జిల్లాలో రైతు ఉద్యమాల వేదికగానే రాజకీయ పార్టీలు ఇప్పుడు డీ అంటే ఢీ అంటున్నాయి.

ఎమ్మెల్సీ కవిత పర్యటన, నిరసనల సెగ : –
ఎమ్మెల్సీ కవిత…నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నప్పడు జగిత్యాల జిల్లా రాజకీయాలను శాసించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడంతో అర్వింద్ ఎంపీ అయ్యారు. నిజమాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో కీలకంగా ఉన్న జగిత్యాల జిల్లాను కాషాయమయం చేయడానికి వేస్తున్న పాచికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కవితను మళ్లీ రంగంలోకి దించితే పార్టీకి మైలేజ్‌ వస్తుందని టీఆర్‌ఎస్ భావించిందట. ఎమ్మెల్సీ హోదాలో స్థానిక కార్యక్రమాలకు హాజరైన కవితను..బోర్నవిల్లి బ్రిడ్జి పనుల పరిశీలనకు తీసుకెళ్లారు గులాబీ నేతలు. ఎంపీగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించిన కవితకు…ఇటీవల పర్యటనలో నిరసనల సెగ తగిలింది. ఏ హోదాలో అభివృద్ది పనులను పర్యవేక్షిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియా వేదికగా కవిత పర్యటనపై మొదలైన చర్చ దుమారమే రేపింది. దీంతో టీఆర్‌ఎస్ అనుకున్నది ఒకటయితే అయిందొకటనే వారూ లేకపోలేదు.

పార్టీల వ్యూహాలు కలిసివచ్చేనా : –
అధికార పార్టీని విమర్శించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని బీజేపీ శ్రేణులు వదులుకోవట్లేదట. రైతాంగ సమస్యలపై పోరాటం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం కొనసాగుతుండగా… ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు స్క్రీన్‌ప్లే కూడా బీజేపీదేనని ఆరోపిస్తున్నారు టీఆర్‌ఎస్ నేతలు. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ టీఆర్‌ఎస్ సైతం రైతుల పక్షాల ఆందోళలను షురూ చేయడంతో మరింతగా వేడి రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం..రైతు వ్యతిరేక విధానాలను అవలంభవిస్తుందంటూ బంద్‌లో కదం తొక్కారు గులాబీ నేతలు. కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పర్యటనలో సర్పంచ్‌ల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పాల్గొనడంతో.. టీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. ఒకప్పుడు ఏం చేసినా టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చేదని టాక్‌ ఉంది. ఇప్పుడు ఏం చేసినా బీజేపీకి మైలేజ్‌ వస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. మరి.. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి.