High Court : గణేష్ మండపాలు, విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సింతటిక్ పెయింట్ వేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని ఆదేశించింది.

High Court : గణేష్ మండపాలు, విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

High Court

High Court : శుక్రవారం వినాయక చతుర్థి కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మండపాల ఏర్పాటు పూర్తైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది.

హుస్సేన్‌సాగర్‌ లో రబ్బరు డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఒకే రోజు కాకుండా ప్రణాళిక ప్రకారం అనుమతించాలని పోలీసులకు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేయాలనీ ప్రజలకు కోరింది. నిమజ్జన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా మండపాల ఏర్పాటు ఉండాలని సూచించింది. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించింది.

మండపాల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని తెలిపింది హైకోర్టు. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని వెల్లడించింది. వినాయకమండపాల వద్ద శానిటైజర్ ఉంచాలని తెలిపింది.