పండుగ పూటైనా..బస్సులు బోర్డర్ దాటుతాయా ?

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 06:23 AM IST
పండుగ పూటైనా..బస్సులు బోర్డర్ దాటుతాయా ?

TSRTC And APSRTC : తెలంగాణ-ఏపీ మధ్య పండగ పూటైనా బస్సులు సరిహద్దులు దాటుతాయా? తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందా? తాత్కాలిక ఒప్పందంతోనైనా సర్వీసులు స్టార్ట్‌ అవుతాయా? కిలోమీటర్ల ప్రకారమే బస్సులు నడుపుతామని ఏపీ.. రూట్ల ప్రకారమే సర్వీసులు తిప్పాలని తెలంగాణ పట్టుబడుతుండటంతో రెండు రాష్ట్రాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్టీసీ ఎండీలు, ఈడీల స్థాయిలో చర్చలు జరిగినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.



దసరా పండగకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్‌ దోపిడీ నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించాలని.. ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. దసరాకు కనీసం 70వేల కిలోమీటర్లైనా బస్సులు తిప్పేందుకు తాత్కాలిక అగ్రిమెంట్ చేసుకుందామని తెలంగాణను కోరింది. ఇందుకు సంబందించిన రూట్‌మ్యాప్‌లను కూడా పంపించింది. ప్రస్తుతానికి టీఎస్‌ఆర్టీసీ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదు.



ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనపై తెలంగాణ ఇంకా సమాధానం ఇవ్వలేదు. మరోవైపు కొత్త అగ్రిమెంట్‌కు ఏపీ ఒప్పుకోవాలని తెలంగాణ కోరుతుంది. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడపడం వల్ల తాము ఇన్నాళ్లు నష్టపోయామని.. తెలంగాణ వాదిస్తోంది. తాత్కాలిక ఒప్పందం కుదిరితే ఏపీ ఆర్టీసీ బస్సులు తెలంగాణ దారి పట్టనున్నాయి. పండగ పూట ప్రయాణికుల అవస్థలు కూడా తీరనున్నాయి.