డబ్బులు చెల్లించకుండానే..కార్డుతో బస్ టికెట్, 16 నెంబర్ బస్సులో

డబ్బులు చెల్లించకుండానే..కార్డుతో బస్ టికెట్, 16 నెంబర్ బస్సులో

TSRTC Bus ticket : టీఎస్‌ఆర్టీసీలో క్యాష్‌లెస్‌ టికెట్‌ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్‌ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం కోసం తొలుత హైదరాబాద్‌ సిటీలోని 16వ నంబర్‌ బస్‌ రూట్‌ను కేటాయించారు. ఈ రూట్‌లో తిరిగే బస్సుల్లో దీన్ని అమలు చేసి.. లోటుపాట్లు, లాభనష్టాలు గుర్తించి దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక కార్డులను 30రూపాయలు చెల్లించి కొనాలి.

అందులో నిర్ధారిత మొత్తాన్ని టాప్‌ అప్‌ చేయించుకోవాలి. ప్రయాణికుడు ఏ స్టేజీలో దిగాలో నమోదు చేసి అతడి వద్ద ఉన్న కార్డులో ఉండే క్యూఆర్‌ కోడ్‌ను కండక్టర్‌ స్కాన్‌ చేయగానే నిర్ధారిత టికెట్‌ మొత్తం కార్డు నుంచి డిడక్ట్‌ అవుతుంది. ఆ యంత్రం నుంచి టికెట్‌ జారీ అవుతుంది. ఇటీవల వన్‌ మనీ అనే ప్రైవేటు కంపెనీ ఈ కార్డు విషయంలో ఆర్టీసీని సంప్రదించింది. ఈ మేరకు ప్రయోగాత్మక పరిశీలన రూట్‌ను దానికి అప్పగించారు. సిటీలో సికింద్రాబాద్‌ కుషాయిగూడ మధ్య ఉండే 16వ నంబర్‌ బస్‌ రూట్‌లో దీన్ని అమలు చేయనున్నారు. కార్డును వినియోగించి టికెట్‌ కొంటే నిర్ధారిత బస్సు చార్జీపై 5 శాతం రాయితీ ఇచ్చేలా యోచిస్తున్నారు. దీంతో ప్రయాణికుడికి కొంత వెసులుబాటు కలుగుతుంది. డబ్బు చెల్లించడం కంటే నగదు రహిత లావాదేవీకే మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.