అయ్యో ఆర్టీసీ : స్ర్కాప్ పాలసీతో కష్టాలు

అయ్యో ఆర్టీసీ : స్ర్కాప్ పాలసీతో కష్టాలు

tsrtc

TSRTC Trouble with scrap policy : జబ్బుతో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడితే దాని బాధ ఎలా ఉంటుందో.. టీఎస్ ఆర్టీసీకి అలాంటి బాధే వచ్చింది. పార్లమెంట్‌లో కేంద్రం తీసుకొచ్చిన స్ర్కాప్ పాలసీ తెలంగాణ ఆర్టీసీకి మరిన్ని కష్టాలు తీసుకురానుంది. స్ర్కాప్ పాలసీ ప్రకారం కాలం చెల్లిన వాహనాలన్నీ తుక్కుతుక్కుగా మారనున్నాయి. ఇప్పటికే కరోనా నష్టాల నుంచి ఎలా బయటపడాలా? అని చూస్తున్న తరుణంలో కొత్త పాలసీ ఆర్టీసీకి పెను భారంగా మారింది. కాలం చెల్లిన వాహనాలతో పెరుగుతున్న కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. అయితే ఇదే పాలసీ ఇప్పుడు ఆర్టీసీకి శాపంగా మారనుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలన్నింటిని స్ర్కాప్ చేయాల్సిందేనని కేంద్రం చెప్పడంతో.. ఆర్టీసీలోని చాలా బస్సులు తుక్కుతుక్కుగా మారనున్నాయి.

ఇప్పటికే కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చేందుకే ఆర్టీసీ తలకిందులైతున్న తరుణంలో స్ర్కాప్ పాలసీతో మరిన్ని కష్టాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 10వేల 800 బస్సులు, సిటీలో 3వేల 500 బస్సులు ఉన్నాయి. ఇందులో 70 బస్సులను కార్గో సర్వీసులకు ఆర్టీసీ వినియోగిస్తోంది. ఆర్టీసీలో నడిచే ప్రతి బస్సు కాలపరిమితిని.. కిలో మీటర్లను బట్టి నిర్ణయిస్తారు. అయితే ప్రతి ఏడాది బస్సులను రీప్లేస్మెంట్ చేస్తున్న టీఎస్ ఆర్టీసీ.. 2029 నాటికి 8వేల 352 బస్సులను రీప్లేస్ చేయాల్సి ఉంది. ఇందుకు 2వేల 507 కోట్లు ఖర్చవుతుంది. అలాగే ప్రతీ ఏడాది 300 బస్సులు కొనుగోలు చేయాల్సిన ఆర్టీసీ.. గత ఆరేళ్లలో కేవలం 600 బస్సులను మాత్రమే కొనుగోలు చేసింది. దాదాపుగా అద్దె బస్సులతోనే నడిపిస్తున్నారు. అయితే ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సబ్సిడీ కింది 40 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది.

కానీ ఆ బస్సులు కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలోనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీ బస్సుల వల్ల విపరీతమైన కాలుష్యం వెలువడుతోంది. నగరంలో ఉన్న 3వేల బస్సులు ఏడాదికి దాదాపు 6 లక్షల కిలోల కార్బన్ విడుదల చేస్తున్నాయి. దీంతో నగర ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశముంది. అలాగని ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేంత బడ్జెట్‌ కూడా లేదు. ప్రస్తుతం మన దేశంలో సాధారణ బస్సులను ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోకి కన్వర్ట్‌ చేసే పరిజ్ఞానం ఉంది. సిటీలో తిరిగే 3వేల బస్సులను కన్వర్ట్ చేస్తే.. సుమారు 240 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇంధన పొదుపుతో ఆర్టీసీకి 300 కోట్లకు పైగా ఆదా అవుతోంది. మరి ఈ దిశగానైనా ఆర్టీసీ ఆలోచిస్తుందా? లేదా? అన్నది చూడాలి. మొత్తంగా వాహనాల స్క్రాప్ పాలసీతో టీఎస్ ఆర్టీసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాలసీని పకడ్బంధీగా అమలు చేస్తే.. ఏడాదికి 300 బస్సులను స్క్రాప్ కింద తొలగించాల్సి ఉంటుంది. అసలే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి.. ఈ పాలసీ తలకుమించిన భారంగా అయ్యే అవకాశం కనిపిస్తోంది.