KTR, Revanth Reddy Twitter War : కేటీఆర్-రేవంత్ ల మధ్య ట్విట్టర్ వార్ ఎటు దారి తీస్తుంది

టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్‌ వార్ మరో మలుపు తీసుకుంది. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై న్యాయపోరాటానికి దిగారు మంత్రి కేటీఆర్.

KTR, Revanth Reddy Twitter War : కేటీఆర్-రేవంత్ ల మధ్య ట్విట్టర్ వార్ ఎటు దారి తీస్తుంది

Ktr Revanth Reddy

KTR, Revanth Reddy Twitter War : టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్‌ వార్ మరో మలుపు తీసుకుంది. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై న్యాయపోరాటానికి దిగారు మంత్రి కేటీఆర్. మరోవైపు డ్రగ్స్‌ కేసులో ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని.. రాహుల్‌ ఒప్పుకుంటే ఎయిమ్స్‌కైనా వస్తానన్నారు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు కేటీఆర్.

TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, TPCC చీఫ్‌ రేవంత్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరు చాలెంజ్‌ చేస్తుంటే మరికొరు దానికి దానికి కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఇద్దరి వార్‌తో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైట్‌ ఛాలెంజ్‌ పేరుతో తనతో పాటు డ్రగ్స్ టెస్టుకు రావాలని రేవంత్‌రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ రచ్చకు దారితీసింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో తాను డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. రాహుల్ గాంధీ కూడా వస్తారా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన వారితో కలిసి పరీక్షలు చేయించుకునే స్థాయి తనది కాదంటూ రేవంత్‌కు చురకలు అంటించారు కేటీఆర్. తనకు డ్రగ్స్ పరీక్షల్లో క్లీన్ చిట్ వస్తే.. క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటుకు కేసులో లై డిటెక్టర్‌ టెస్ట్ చేయించుకునేందుకు రేవంత్ రెడీగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

దీనికి రేవంత్‌రెడ్డి కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. తమ సవాళ్ల మధ్యలోకి సీఎం కేసీఆర్‌ పేరును తీసుకొచ్చారు. ‘‘లై డిటెక్టర్‌ టెస్టుకు సమయం, స్థలం కేటీఆరే చెప్పాలి. అయితే నాతోపాటు సీఎం కేసీఆర్‌ కూడా సహారా పీఎఫ్‌ అవినీతి కేసులో, ఈఎ్‌సఐ ఆస్పత్రుల నిర్మాణం కుంభకోణం కేసులో లై డిటెక్టర్‌ టెస్టుకు రావాలి’’ అంటూ రేవంత్‌ రీట్వీట్‌ చేశారు. దీంతో తనపై ఆరోపణలకు సంబంధించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం ఉందని తెలిపారు.

కేటీఆర్‌కు వైట్‌చాలెంజ్‌ విసిరిన రేవంత్‌రెడ్డి పలువురు కాంగ్రెస్‌ నేతలతో కలిసి సోమవారం ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. ‘‘సే నో టు డ్రగ్స్‌’’ అంటూ కాంగ్రెస్‌ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి, అద్దంకి దయాకర్‌ తదితరులు అక్కడికి చేరుకొని సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో లిక్కర్‌తో పాటు డ్రగ్స్‌ దందా పెద్ద ఎత్తున జరుగుతోందన్న చర్చ ఉందన్నారు. డ్రగ్స్‌ కేసులో సేకరించిన సమాచారాన్ని కేంద్ర సంస్థలకు ఇవ్వబోమని కేసీఆర్‌ సర్కారు కోర్టులో అఫిడవిట్‌ వేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ప్రశ్నించారు. కాపాడే ప్రయత్నం నిజం కాకపోతే తాను విసిరిన వైట్‌ చాలెంజ్‌కు మంత్రి ఎందుకు రాలేదని అన్నారు.

కాగా, మంత్రి కేటీఆర్‌ కోసం మధ్యాహ్నం 2 గంటల దాకా   గన్ పార్క్ దగ్గర ఎదురు చూసిన అనంతరం అక్కడినుంచి కాంగ్రెస్‌ నేతలు వెళ్లిపోయారు. మరోవైపు వైట్‌ చాలెంజ్‌ను స్వీకరించి డ్రగ్స్‌ టెస్టుకు సిద్ధపడినందుకు విశ్వేశ్వర్‌రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ప్రశంసించారు. ‘‘మరి డ్రగ్స్‌ అంబాసిడర్‌ సిద్ధపడతారా?’’ అంటూ ఠాగూర్‌ వ్యాఖ్యానించడం ట్విటర్లో హల్‌చల్‌ అయింది.

కేటీఆర్‌ పదే పదే తన స్థాయి గురించి మాట్లాడుతున్నారని, కానీ.. రాజకీయంగా మంత్రి తన వెంట్రుకతో సమానమని రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ తాను అలా అన దలుచుకోలేదన్నారు. కేటీఆర్‌ స్థాయి తన కంటే పెద్దదనడం విడ్డూరమని, కేటీఆర్‌ కంటే ముందే తాను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ అయ్యానని తెలిపారు. ఆ తరువా రెండుసార్లు ఎమ్మెల్యే, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీగా ప్రస్తుతం సేవలందిస్తున్నానని పేర్కొన్నారు.

ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అయ్యాయని గుర్తు చేశారు. కేటీఆర్‌ కంటే తాను ఏ విధంగా తక్కువ స్థాయి వాడినో మంత్రి చెప్పాలన్నారు. కేటీఆర్‌ తన తండ్రి పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని, లేదంటే తెలంగాణలో ఆయనకు చెప్రాసీ ఉద్యోగం కూడా వచ్చేది కాదని అన్నారు.

మరోవైపు తనపై పదేపదే చేస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటానికి దిగారు కేటీఆర్. తనపై దుష్ర్పచారం చేశారంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. న్యాయస్థానంలోనే వ్యవహారాన్ని తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని కోర్టు శిక్షిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రేవంత్‌రెడ్డి కొంతకాలంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, డ్రగ్స్‌ కేసులో ఈడీ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో, ఆయా కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని తెలిపారు. ఇందుకు రేవంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ట్విటర్‌, ఫేస్‌బుక్‌ నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించే విధంగా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.

దుష్ప్రచారం వల్ల తన పరువుకు కలిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా ఆదేశించడంతోపాటు క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను సైతం ప్రారంభించాలని కోరారు. అయితే కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని, పూర్తి ఆధారాలతో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. దీంతో  సెప్టెంబర్ 21 మంగళవారం నాడు పూర్తి ఆధారాలతో మళ్లీ పిటిషన్‌ వేసేందుకు కేటీఆర్‌ సిద్ధమవుతున్నారు.

కేటీఆర్ ఈరోజు కోర్టులో పిటిషన్ వేయనుండడంతో ఏం జరగనుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు పరువు నష్టం కిందకే వస్తాయంటున్నారు హైకోర్టు న్యాయవాదులు. కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి… దానికి న్యాయస్థానంలో ఆధారాలు చూపించాల్సి ఉంటుందంటున్నారు హైకోర్టు సీనియర్ లాయర్లు.

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైట్‌ ఛాలెంజ్‌లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ మండిపడ్డారు. బాగా బలిసినోడు.. బలుపెక్కినోడు డ్రగ్స్ తీసుకుంటారని.. పర్సనల్ ఛాలెంజ్‌లతో ప్రజలకు ఒరిగేది ఏం లేదన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు వైట్‌ ఛాలెంజ్‌ చేశారన్న బండి సంజయ్‌.. అక్టోబర్‌ 2 తర్వాత ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తానని స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. దానికి కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు ఎక్కడి వరకు వెళ్తాయనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది.