గాంధీ ఆసుపత్రి నుంచి వెళ్లిన కరోనా అనుమానితులు..రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిపివేత

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 06:14 AM IST
గాంధీ ఆసుపత్రి నుంచి వెళ్లిన కరోనా అనుమానితులు..రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిపివేత

కోవిడ్ – 19 (కరోనా) గురించి ఎప్పుడు..ఏ వార్త వినాల్సి వస్తోందన్న భయం నగర ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అధికమౌతుండడమే కారణం. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానీ కొంతమంది దీని తప్పించుకొనేందుకు మార్గాలు వెతుకుతున్నారు. తాజాగా..ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు దంపతులు రైలులో ప్రయాణం చేస్తున్నారనే వార్త తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…
వరంగల్ జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా రాజధాని ఎక్స్ ప్రెస్ 2020, మార్చి 21వ తేదీ శనివారం వెళుతోంది. బీ 3 బోగీలో ఉన్న దంపతులను టీసీ గుర్తించారు. వీరి చేతుల మీదు ఐసోలేషన్‌లో చికిత్స చేసినట్లుగా గుర్తించే ముద్ర ఉంది. దీనిని టీసీ గమనించి..ప్రశ్నించారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో పై అధికారులకు విషయాన్ని తెలియచేశారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు.

 

కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. 108 వాహనం ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో బీ 3 బోగీలో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వైద్యాధికారులు అక్కడకు చేరుకుని రసాయనాలు చల్లారు. ఆ ప్రాంతమంతా స్త్ర్పే చేశారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈ దంపతులను స్క్రీనింగ్ టెస్టులు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆసుపత్రిలోని గాంధీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా వారి చేతులపై ముద్ర వేసి చికిత్స అందిస్తున్నారు. కానీ ఎలా బయటకు వచ్చారో తెలియడం లేదు. నేరుగా రాజధాని ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణించడం కలకలం రేపింది. 
Read More : కోవిడ్ – 19 (కరోనా)..రాకూడదంటే ఇలా చేయొద్దు!