Delta Strain: బ్రిటన్‌ను వణికిస్తున్న కరోనా వేరియంట్ తెలంగాణలో!!

కరోనా కష్టాల నుంచి కోలుకున్నట్లుగా భావిస్తున్న తరుణంలో ఓ విషయం కంగారుపెట్టేస్తుంది.

Delta Strain: బ్రిటన్‌ను వణికిస్తున్న కరోనా వేరియంట్ తెలంగాణలో!!

Corona

New Variant: కరోనా కష్టాల నుంచి కోలుకున్నట్లుగా భావిస్తున్న తరుణంలో ఓ విషయం కంగారుపెట్టేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బ్రిటన్‌లో కరోనా ఉదృతికి కారణమైన ‘ఏవై.4.2’ వేరియంట్ కేసులు తెలంగాణలోనూ కనిపిస్తున్నాయి. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో ఇద్దరిలో ఈ తరహా వైరస్‌ కనిపించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆధ్వర్యంలోని గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఇన్‌ షేరింగ్‌ ఆఫ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది.

సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులకు సంబంధించి 274మంది రక్త నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ లేబరేటరీలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అందులో ఇద్దరి నమూనాల్లో ‘ఏవై.4.2’ కరోనా వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించారు వైద్యశాఖ అధికారులు. 22ఏళ్ల యువతికి, 48 ఏళ్ల మధ్య వయస్కుడిలో ఈ నామూనాలు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 26వేల కేసులు ఈ వేరియంట్ కారణంగా నమోదవగా.. మన దేశంలో కూడా ఈ వేరియంట్ వల్లే మూడో వేవ్ రావచ్చుననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నిమ్స్‌ నుంచి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు వచ్చిన నమూనాల్లో ఈమేరకు వేరియంట్ గుర్తించినట్లు చెప్పారు. అయితే, బాధితుల ప్రస్తుత పరిస్థితి ఏంటీ? ఎలా ఉన్నారు? అనే విషయాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.

సెకండ్‌ వేవ్‌ సమయంలో డెల్టా వేరియంట్‌ ప్రపంచాన్ని వణికించగా.. తెలంగాణలోనూ లక్షలాది మంది కరోనా బాధితులయ్యారు. వేల మంది కరోనా కారణంగా చనిపోయారు. డెల్టా వేరియంట్‌లో మూడు బై వేరియంట్స్ ఉండగా.. వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో రెండు అదనపు మ్యుటేషన్లు కూడా ఉన్నాయి.

ఏ222వీ, వై145హెచ్‌ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడా. ఈ ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మరణించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

బ్రిటన్‌లో వేగంగా కేసులు పెరగడానికి కారణమైన వేరియంట్ తెలంగాణలో వెలుగులోకి రావడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.