గుండు కారణంగా ఉపాధి పోయింది..

కొన్నిసార్లు ముఖం గుర్తుపట్టలేనంతగా.. కొన్నిరోజుల్లోనే మారిపోతూ ఉంటాం.. సర్జరీలు చేయించుకోవడం వల్ల ఎక్కువసార్లు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది.

గుండు కారణంగా ఉపాధి పోయింది..

Uber

కొన్నిసార్లు ముఖం గుర్తుపట్టలేనంతగా.. కొన్నిరోజుల్లోనే మారిపోతూ ఉంటాం.. సర్జరీలు చేయించుకోవడం వల్ల ఎక్కువసార్లు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి గుండు చేయించుకోవడం వల్ల రూపం మారిపోయింది. రూపం మారడమే శాపమై సదరు వ్యక్తి ఉపాధికే ఇబ్బంది వాటిల్లింది. గుండుతో విధుల్లో చేరేందుకు సిద్ధమైన ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌కు ఉబర్‌ యాప్‌ గుర్తుపట్టకపోవడంతో ఉపాధి పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శ్రీకాంత్‌.. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్నాడు. ఫిబ్రవరి 27న పలుమార్లు సెల్ఫీతో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. తర్వాత పూర్తిగా బ్లాక్‌ అవ్వడంతో ఇప్పటివరకు 1428 ట్రిప్‌లతో 4.67 స్టార్‌ రేటింగ్‌తో ఉన్న సదరు డ్రైవర్‌ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు.

ఇదే విషయమై ఉబర్ సంస్థను సంప్రదించగా.. తలపై జుట్టు లేకపోవడంతో యాప్‌ నన్ను గుర్తించదని ఖాతా బ్లాక్‌ అయింది. కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించినట్లుగా డ్రైవర్ చెబుతున్నారు. నెల రోజులు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉబర్ నుంచి స్పందన రాకపోవడంతో.. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. జీవనాధారం అయిన కారుకు ఈఎంఐ కూడా చెల్లించలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా యాప్‌ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్‌ సలాయుద్దీన్‌ తెలిపారు.

ఇప్పటికే గతేడాది నుంచి లాక్‌డౌన్‌ కారణంగా డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురైనట్లుగా డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.