నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో నిరుద్యోగ భృతి

minister-ktr1

Unemployment Benefits : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీపి కబురు వినిపించారు. నిరుద్యోగ భృతి త్వరలోనే అమలు కానుందని ప్రకటించారు. 2021, జనవరి 28వ తేదీ గురువారం తెలంగాణ భవన్ లో రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే లక్షా 31 వేల ఉద్యోగాల భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సమస్య దాదాపు అధిగమించడం జరిగిందని, భవిష్యత్ లో కరెంటు పోదని ఖచ్చితంగా చెప్పగలమన్నారు. అన్ని రంగాలు విద్యుత్ సమస్యతో తల్లడిల్లేవని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో వీటన్నింటినీ అధిగమించి..ముందుకెళుతున్నట్లు వెల్లడించారాయన. విద్యుత్ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని 14 వేలకు పెంచగలిగినట్లు తెలిపారు.

అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని, దేశంలోని పరిశ్రమలకు సరిపడా కరెంటు ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. విద్యుత్ కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.