Vaccination : తెలంగాణలో లాక్ డౌన్ ఉన్నా టీకా ప్రక్రియ యథాతధం

లాక్ డౌన్ ఉన్నా తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.

Vaccination : తెలంగాణలో లాక్ డౌన్ ఉన్నా టీకా ప్రక్రియ యథాతధం

Vaccination

Vaccination in Telangana :  కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పది రోజులపాటు లాడ్ డౌన్ విధించింది. అయితే లాక్ డౌన్ ఉన్నా తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీకా ప్రక్రయలో ఎలాంటి మార్పులు ఉండవని, ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

45 ఏళ్లు పైబడి రెండో డోస్ తీసుకునే వారికి టీకా ఇవ్వనున్నామని కోవాగ్జిన్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత, కోవిషీల్డ్ తీసుకున్న ఆరు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలని ఆయన తెలిపారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. వ్యాక్సిన్ల కొరత ఉండటంతో ఫస్ట్ ప్రియారిటీ కింద 45 ఏళ్లు దాటిన వారి కేటగిరిలో రెండో డోస్ వారికి మాత్రమే టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు సహా వైద్య ఆరోగ్యశాఖ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతుున్నాయి. లాక్ డౌన్ ఎక్కడా కూడా ఆరోగ్య సేవలను ప్రభావితం చేయదని శ్రీనివాస్ తెలిపారు. కోవిడ్ టీకా కేంద్రాలు పని చేస్తాయని, కేవలం రెండో డోస్ పొందే వారికే టీకా ఇస్తామని స్పష్టం చేశారు.

రెండో డోస్ తీసుకునే వారు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆధారాలు చూపించాలని, కోవిన్ యాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న మెసేజ్ ను టీకా కేంద్రాల్లో కచ్చితంగా చూపించాలని తెలిపారు. టీకా తీసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని వ్యాక్సిన్ సెంటర్లకు రావాల్సివుంటుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు కోవిడ్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఇక వ్యాక్సిన్, కరోనా పరీక్షల కోసం వెళ్లే వారు ఎలాంటి భయం లేకుండా వెళ్లొచ్చని పోలీసు శాఖ తెలిపింది. వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు సమీప కోవిడ్ టెస్టు సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చని, అలాంటి వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది.