కరోనా టీకా..ఆపై సిరా గుర్తు

కరోనా టీకా..ఆపై సిరా గుర్తు

vaccination-starts

Vaccination Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30కి వ్యాక్సినేషన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 140 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో 14 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నిమ్స్ లో 2021, జనవరి 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళి సై వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్నారు.

గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటల రాజేందర్, తిలక్ నగర్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం 200-300 సెంటర్లలో టీకా ప్రక్రియ మొదలవుతుందన్నారు. టీకా వేసుకున్నవ వారికి గుర్తుగా ఎన్నికల్లో ఉపయోగించే సిరానే ఎడమచేతి బొటన వేలిపై వేస్తామన్నారు. గురు, శుక్రవారాల నాటికి 500-600 కేంద్రాల్లో టీకాలు వేస్తామని, మొత్తంగా 1213 కేంద్రాల్లో కరోనా టీకాలు వేస్తామన్నారు.

ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 140 కేంద్రాల్లో 4200 మందికి తొలిరోజు వ్యాక్సిన్.
వ్యాక్సినేషన్ లో పాల్గొననున్న 50 వేల మంది సిబ్బంది. వ్యాక్సిన్ వేసేందుకు 10 వేల మంది వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.
వారంలో 4 రోజులే. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు.
అంగీకారపత్రం ఉంటేనే..భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
కోవిషీల్డ్ టీకాకు ఎలాంటి అంగీకార పత్రం అవసరం లేదు.

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత..7 రోజుల పాటు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉండాలని కేంద్రం స్పష్టం చేసిందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో తయారయ్యే కోవాగ్జిన్ టీకాను తాను కూడా వేసుకుంటానని తెలిపారు. ఒకటి రెండు రోజులు పారాసిటమిల్ మాత్రలు వేసుకోవడం సహా సంబంధిత సైడ్ ఎఫెక్ట్స్ కు వైద్యం చేస్తే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత..యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారాయన. టీకా వేసుకున్నాక ఒకవేళ వైరస్‌ ప్రవేశించినా దాని తీవ్రత అంతగా ఉండదన్నారు. కరోనా టీకాపై ఎలాంటి వదంతులు, అనుమానాలు పెట్టుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.