వామన్ రావు దంపతుల హత్య కేసు..బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్…కరీంనగర్ జైలుకు తరలింపు

వామన్ రావు దంపతుల హత్య కేసు..బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్…కరీంనగర్ జైలుకు తరలింపు

Vamanrao couple murder case : మంథని న్యాయవాదుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కరీంనగర్‌ జైలుకు పోలీసులు తరలించారు. అయితే వామన్ రావు దంపతుల హత్యకు వినియోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుని విచారిస్తున్నారు. లాయర్లు వామన్ రావు, ఆయన భార్య దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు శ్రీనును పోలీసులు మంథని మున్సిపల్ కోర్టులో హాజరుపర్చారు.

కేసును స్వీకరించిన కోర్టు.. బిట్టు శ్రీనుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అతన్ని పోలీసులు కరీంనగర్ జైలుకు భద్రత మధ్య తరలించారు. ఈ హత్య కేసులో కత్తులను సరఫరా చేయడంతో పాటు వారికి వాహనం కూడా సమకూర్చాడని, కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్లాన్ వేసినట్లు బిట్టు శ్రీనుపై ఆరోపణలు ఉన్నాయి.

ఇటు బిట్టు శ్రీనును కోర్టుకు తీసుకురావడంతో పెద్ద ఎత్తున లాయర్లు కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. బిట్టు శ్రీనుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. వామనరావు, నాగమణి దంపతులను హత్య చేయించిన బిట్టు శ్రీనుకు కఠిన శిక్ష పడాలని నినాదాలు చేసిన లాయర్లు.. వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణను సస్పెండ్ చేయాలంటూ లాయర్లు చేసిన నినాదాలతో మంథని కోర్టు పరిసరాలు మార్మోగిపోయాయి.

ఇటు హత్యకు వాడిన కత్తుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అయితే ఆ కత్తులను తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంథనికి చెందిన శ్రీను, బాబు, రఘులను విచారిస్తున్నారు. బిట్టు శ్రీను ఆదేశాలతోనే తాము కత్తులను తయారు చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.