Vegetables ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు, కిలో Tomato రూ. 60-70

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 07:41 AM IST
Vegetables ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు, కిలో Tomato రూ. 60-70

Vegetables : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఇప్పుడు ఈ పాట మళ్లీ అక్షర సత్యమైంది. ఒక్కసారి మార్కెట్‌కు వెళ్లి చూస్తే.. గుండె గుభేల్‌మనే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాగ్‌లో డబ్బులు తీసుకెళ్తే.. కవర్లో కూరగాయలు, సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. అటు రైతు బజార్లలో కూడా ధరలు భగ్గుమంటుండటంతో.. జనాలు బెంబేలెత్తిపోతున్నారు.



మార్కెట్‌కెళ్తున్నారా.. అయితే.. ఒక్క నిమిషం.. జేబులు చెక్ చేసుకొండి.. రెండు..మూడు వందలు తీసుకెళ్లి.. నాలుగైదు రకాల కూరగాయలు తెచ్చుకుందామనుకుంటే అస్సలు కుదరదు.. ఎందుకంటే.. మినిమం వెయ్యి రూపాయలు లేకుండా బజార్‌లో బ్యాగ్‌ నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు కరోనా కాటేస్తుంటే.. ఇప్పుడు కూరగాయల ధరలు క్రూరంగా గాయాలు చేస్తోంది. దయా దాక్షిణ్యం లేకుండా.. జేబులకు చిల్లులు పెడుతోంది.



మార్కెట్‌లో రేట్లు చూస్తుంటే.. వినియోగదారుడు వణికిపోవాల్సి వస్తోంది. కరోనాతో కుటుంబాలకు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇప్పుడు ధరాఘాతంతో పుండు మీద కారం చల్లినట్లు.. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా మారింది పరిస్థితి. లాక్ డౌన్ టైంలో కూడా అందరికి అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు విలవిలాడిపోతున్నారు.



మూడు.. నాలుగు రోజుల కిందటి వరకు.. అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు చుక్కలనంటుతున్నాయి. 15 ఉన్న కిలో టమాట (Tomato) ధర ప్రస్తుతం రైతు బజార్లో కిలో 50 ఉండగా ఓపెన్ మార్కెటల్లో 65 నుంచి 70 పలుకుతోంది. రెండు నెలల క్రితం వరకు 20 ఉన్న ఆలూ (Aloo) రైతు బజార్లో 40 దాటింది.



బహిరంగ మార్కెట్లో కిలో 60 వరకు పలుకుతోంది. ఇలా ఏది చూసినా బహిరంగ మార్కెట్లో కిలో 40 నుంచి 60కి తక్కువగా ఉండటంతో లేదు. చిక్కుడు రకాలన్నీ సామాన్యుడికి చిక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక.. ఉల్లిపాయలు, బెండకాయలు, దొండకాయల సంగతి సరేసరి.



రైతు బజార్లలో కేజీ కూరగాయలు 50, 60, రూపాయలు పలుకుతుంటే.. బహిరంగ మార్కెట్లలో దళారులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. హాఫ్‌ కేజీ కూరగాయల ధరలను 50, 60కు పెంచేసి.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కరోనా దెబ్బకు వర్షాలు కూడా తోడవడంతో.. కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. రైతులు, వ్యాపారులు కొనేవాళ్లు లేక.. వినియోగదారులు కూరగాయలను అధిక ధరలతో కొనలేక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.



పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా కూరగాయల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. కరోనా సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి బాగా తినాలని చెబుతుంటే.. ఈ ధరలు ముద్ద మింగుడపడనీయలేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.