గణపయ్యా.. మొక్కులు తీరెదెట్టయ్యా: ఈ సారికి ఇంతేనా?

గణపయ్యా.. మొక్కులు తీరెదెట్టయ్యా: ఈ సారికి ఇంతేనా?

మానవాళిని కలవర పెడుతున్న కరోనా మహమ్మారి దేవుళ్లనూ వదల్లేదు. ఎలుకపై కూర్చోని ఎల్ల లోకములు తిరిగే గణపతికి భూలోకంలో మాత్రం నిబంధనల బ్రేక్ పడింది. ఏటా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈసారి కళ తప్పాయి. వినాయక చవితికి మూడు నాలుగు రోజుల ముందునుంచే సందడి మొదలయ్యేది. కానీ.. ఈ సారి ఆ శోభ మాయమైంది.

సరిగ్గా ఈ టైమ్‌కి కరోనా లేకుంటే.. భారీ మండపాలు ముస్తాబయ్యేవి. కళ్లు చెదిరే సెట్టింగులు ఎట్రాక్ట్‌ చేసేవి. ఎత్తైన విగ్రహాలు అబ్బురపరిచేవి. బ్యాండ్‌ బాజా తీన్‌మార్‌ స్టెప్పులతో ఉత్సవాలు హోరెత్తిపోయేవి. మాయదారి కరోనా కలకలంతో ఇవన్నీ మాయమయ్యాయి. గల్లీ గల్లీలో వెలిసే మండపాలు.. ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు.

ఈ ఏడాది ఉత్సవాలపై కరోనా కాటు:
నవ రాత్రులు జరిగే పూజలు ఒక ఎత్తయితే.. నిమజ్జనంలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. కానీ ఈ సారి ఆ వాతావరణం కనిపించేలా లేదు. ఉత్సవాల ప్రారంభం నుంచి ఎండింగ్‌ దాకా అంతా సాదాసీదాగా జరగనుంది. వినాయక చవితికి నెలల ముందు నుంచే హంగామా మెదలయ్యేది. ఈ ఏడాది ఉత్సవాలపై మాత్రం కరోనా కాటుపడింది. ఉగాది, శ్రీరామ నవమి, రంజాన్‌, బక్రీద్‌, బోనాలు పండుగలను మింగేసినట్టే… వినాయక చవితి సంబరాలను కూడా కరోనా మింగేసింది.

మండపాలకు వందల సంఖ్యలో భక్తులు వెళ్లే ఛాన్స్:
చందాలు వేసుకోవడం… ముందుగానే విగ్రహాలకు ఆర్డర్‌ ఇవ్వడం.. మండపం సెట్టింగ్‌ లాంటి ఏర్పాట్లలో నెల రోజుల ముందుగానే మండపాల నిర్వాహాకులు మునిగిపోయేవారు. అధికార యంత్రాంగం మాత్రం ఈ సారి విగ్రహాలు పెట్టేందుకు ఆంక్షలు విధించింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో కఠినంగా నిబంధనలు విధించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ రోజూ వందల సంఖ్యలో మండపం దగ్గరకు వెళ్తారు. ఈ క్రమంలో గణేశ్‌ ఉత్సవాలు జరపాలంటే కాస్త ఇబ్బందే. ఇక ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణనాథులను నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఉత్సవాలు జరిగితే కరోనా విజృంభణ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉండడంతో ఆంక్షలు విధించారు.

డాన్స్‌లతో గణపయ్యను తీసుకెళ్లే సీన్లు అదుర్స్:
వినాయక చవితి ఉత్సవాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మూడు అడుగులకు మించి విగ్రహాలు ఏర్పాటు చేయొద్దన్న సూచనలతో ఎక్కడ చూసినా బుజ్జి బుజ్జి బొజ్జ గణపయ్యలే కనిపిస్తున్నారు. గణనాధుడ్ని మండపానికి తీసుకెళ్లే సమయంలో ట్రాలీతో పాటు బ్యాండ్‌మేళం బ్యాచ్‌ ఒకటి ఉంటుంది. అక్కడి నుంచే హుషారు మొదలవుతుంది. డప్పు చప్పుళ్లతో నుదుటికి తిలకం దిద్ది డాన్య్‌లతో ఊగిపోతూ భక్తులు గణపయ్యను తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మాత్రం ఇలా వెళ్లి అలా తీసుకెళ్లే సీన్లు కనిపించాయి.

జిల్లాల వారీగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు జరిగేవి. 15 నుంచి 30 అడుగుల ఎత్తులో వేర్వేరు ఆకృతుల్లో ఉన్న విగ్రహాలను పోటీపడి ప్రతిష్ఠించేవారు. పెద్ద పెద్ద సెట్టింగ్లు, మండపాలను వెరైటీగా డెకరేషన్ చేయడం, ప్రతిస్థాపన మొదలు నిమజ్జన ఉత్సవాలను నిర్వహకులు వైభవోపేతంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలపై కరోనా కూల్‌గా నీళ్లు చల్లింది.
ఇప్పుడెక్కడ చూసినా కరోనా భయాలే

నగరాల్లోనే కాదు ఊళ్లో వాడవాడలా గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించేవాళ్లు. మైకుల్లో వినాయకుడి పాటలతో మార్మోగేవి. ఇప్పుడెక్కడ చూసినా కరోనా భయాలే కనిపిస్తున్నాయి. మరోవైపు వినాయక చవితి ఉత్సవాలపై కొన్ని గ్రామాలు ఆదర్శంగా వ్యవహరించాయి. ఊరిలో ఒక గణపతి మాత్రమే పెట్టాలని తీర్మానించాయి. హంగు ఆర్భాటాలకు పోతే ప్రమాదం తప్పదని.. ఉత్సవాల విషయంలో గ్రామస్తులంతా ఏకతాటిపై నిలుస్తున్నారు. ఇక దూల్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాల్లో గతేడాది అంత కాకపోయినా.. ఓ మోస్తరు సంఖ్యలో విగ్రహాలు తయారుచేశారు. కానీ ఆర్డర్లు అంతగా రాలేదు. ఇప్పటికే ఆర్థికంగా చితికిన వీరినెత్తిన పిడుగు పడ్డట్టయింది.