AP-TS Water War: జలవివాదంపై ఏపీ, తెలంగాణ మంత్రుల మాటల తూటాలు

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు.

AP-TS Water War: జలవివాదంపై ఏపీ, తెలంగాణ మంత్రుల మాటల తూటాలు

Ap Ts Water War

AP-TS Water War: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చెయ్యగా.. తెలంగాణ నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.

శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని, జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ జలవిద్యుదుత్పత్తిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార దోరణితో వ్యవహరిస్తోందని, మా ఇష్టమోచ్చినట్లు మేము చేస్తాం.. మేము చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని, అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల‌లో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని, ఎవరో ఆర్డర్ వేస్తే వినాల్సిన అవసరం మాకు లేదన్నారు. కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఆంధ్రప్రదేశ్ దొంగదారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

పాతరోజులు ఇక లేవని.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిందని, ఎవరి చెప్పుచేతుల్లోనూ తెలంగాణ ప్రజలు లేరని, మీ బానిసలు అధికారంలో లేరని జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రావాలని మంత్రి సూచించారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలని, తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదని, అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తాం.”అన్నారు.

ఇష్టానుసారం విద్యుదుత్పత్తి చేసుకుంటే కేఆర్‌ఎంబీ ఎందుకు? అవసరమైతే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిద్దామన్నారు. పాలమూరు, దిండి, నెట్టెంపాడు విస్తరణకు ఆమోదం లేదని, మా సంయమనం చేతకాని తనం కాదన్నారు. తెలంగాణ తీరుపై ప్రధానికి, జల్‌శక్తి మంత్రికి లేఖ రాస్తున్నట్లు మంత్రి అనిల్‌ వెల్లడించారు.