Weekend Lockdown : లాక్ డౌన్ అవసరం లేదు… వీకెండ్ లాక్ డౌన్ పరిశీలిస్తాం.. సీఎస్ సోమేష్ కుమార్

Weekend Lockdown : లాక్ డౌన్ అవసరం లేదు… వీకెండ్ లాక్ డౌన్ పరిశీలిస్తాం.. సీఎస్ సోమేష్ కుమార్

Weekend Lockdown May Impose In Telangana Says Cs Somesh Kumar

Weekend Lockdown :  తెలంగాణ‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవసరం ఉండ‌ద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచ‌నల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని, ఆ మేర‌కు వీకెండ్ లాక్‌డౌన్ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని  ఆయన  చెప్పారు.

పూర్తి స్థాయి లాక్‌డౌన్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని … లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండదని అన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్ కార‌ణంగానే రాష్ర్టానికి టెస్టింగ్ కిట్లు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తెలంగాణకు రావాల్సిన సిలిండర్లు, రెమిడేసివిర్ ఇంజక్షన్లను పంపమని అడిగామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల కోవిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొందరు అనవసరంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నారని, లక్షణాలుంటేనే టెస్టులు చేయించుకోవాలని సీఎస్  సూచించారు. లాక్‌డౌన్ కంటే మంచి చికిత్సను అందించ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని….. త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని సోమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొన్ని రోజులుగా రాష్ట్రంలో  కేసులు తగ్గు ముఖం పడుతున్నాయని… ప్రతి ఆస్పత్రిలో పడకలతో పాటు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తమకు ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినా, ప్రతి నిత్యం తమతో సమీక్షలు చేశారని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్‌కు హబ్‌గా తయారైందని, కరోనాకు భయపడాల్సిన అవసరమే లేదని భరోసా కల్పించారు.  ఇతర రాష్ట్రాల వారూ ఇక్కడికే   చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 120 టన్నుల ఆక్సిజన్ రోజూ అవసరమవుతుందని,  తాము మాత్రం 400 టన్నుల ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు.

లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుందని…. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  మిగతా రాష్ట్రాలతో   పోలిస్తే తెలంగాణ లో కరోనా అదుపులోనే ఉందని  చెపుతూ ఆయన…. స్థానిక అవ‌స‌రాలు, అక్క‌డి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పొరుగు రాష్ర్టాలు లాక్‌డౌన్ పెట్టుకున్నాయ‌ని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో వ్యాక్సిన్, ఆక్సిజన్,  పడకలకు ఎలాంటి లోటూ లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 42 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ను అందించామని,  45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని తెలిపారు.