మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందంటే?

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 03:06 PM IST
మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందంటే?

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..? ప్రణయ్ హత్య కేసులో శిక్ష తప్పదని ముందే ఊహించి అనర్ధాన్ని కొనితెచ్చుకున్నాడా..? కారణం ఏదైనా.. ఒక్క మరణం వంద సందేహాలను మిగిల్చింది. మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందంటే?

న్యాయవాదితో మాట్లాడేందుకు మారుతీరావు శనివారం హైదరాబాద్‌ వచ్చారు. ఆర్యవైశ్య భవన్‌లోని రూమ్‌ నెంబర్‌ 306కి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి వెళ్లాడు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కారు డ్రైవర్‌ని పిలిచి గారెలు తెమ్మని చెప్పాడు. రాత్రి 8గంటలకు గారెలు ఇచ్చిన డ్రైవర్‌కి.. బయట ఎక్కడైన భోజనం చేసి కారులోనే పడుకోమని చెప్పి 500 రూపాయలు ఇచ్చాడు మారుతీరావు. ఉదయాన్నే లాయర్ దగ్గరికి వెళ్లాలని అతనికి చెప్పాడు. 8గంటల తర్వాత భార్యకు కాల్‌ చేసి మాట్లాడిన మారుతీరావు.. 9 గంటలకు వైట్‌పేపర్లు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత తన ఫోన్ స్విచాఫ్‌ చేసుకున్నాడు. 

ఆదివారం ఉదయం 6 గంటలకు రాజేష్‌ మారుతీరావు గది తలుపుతట్టినా తీయకపోవడంతో ఇంకా లేవలేదనుకుని వెళ్లిపోయాడు. మళ్లీ 7 గంటలకు వచ్చి తలుపుతట్టాడు. మారుతీరావు స్పందించకపోవడంతో ఫోన్‌ చేశాడు. అదే సమయంలో మిర్యాలగూడ నుంచి మారుతీరావు భార్య గిరిజ డ్రైవర్‌కు ఫోన్‌ చేశారు. సార్‌ ఫోన్‌ లేపడంలేదేంటని ఆమె అడిగారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వారొచ్చాక తలుపు తెరిచారు. రెండు చేతులూ ముఖం కింద పెట్టుకుని అచేతన స్థితిలో బోర్లా పడి ఉన్న మారుతీరావు కనిపించారు. అప్పటికే ఆయన చనిపోయినట్టు గుర్తించారు. మంచం పక్కన వాంతులు చేసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించాయి.

గిరిజా క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు రా అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం మిర్యాలగూడకు చెందిన ఓ న్యాయవాది మారుతీరావుతో మాట్లాడి.. ఏమీ కాదని చాలాసేపు ధైర్యం చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాతా మారుతీరావు హైదరాబాద్‌లోని మరో ముగ్గురు న్యాయవాదులను సంప్రదించినట్టు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ ను విచారించారు. సార్ రాత్రి గారెలు తీసుకురమ్మని చెప్పడంతో అవి ఇచ్చేసి తాను బయటికి వెళ్లినట్లు చెప్పాడు. గారెల్లోనే విషం కలుపుకొని తిని ఉంటాడని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అయితే క్లూస్‌టీం గదిలో పురుగు మందు సీసా కోసం ఎంత వెతికినా దొరకలేదు.

ప్రణయ్‌ హత్యకేసు నుంచి బయటపడే మార్గందొరకక.. శిక్ష తప్పదని తెలియడంతో మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారన్నారు వరంగల్ ఏసీపీ శ్రీనివాస్‌. ప్రణయ్‌-అమృత పెళ్లి దగ్గర నుంచి.. ప్రణయ్‌ హత్యవరకు ఈ ఇష్యూను మిర్యాలగూడ డీసీపీగా పనిచేసిన శ్రీనివాస్ డీల్ చేశారు. శిక్ష నుంచి తప్పించుకునే మార్గం తెలియకే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చంటోన్నాడు. ప్రణయ్‌ హత్యపై పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశామని చెప్పారు. అమృతను తన దగ్గరికి రప్పించుకునేందుకు మారుతీరావు చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు.