10 రోజులుగా ఫాం హౌస్‌లో కేసీఆర్ | What is KCR Doing in Farm House Since Ten Days

10 రోజులుగా ఫాం హౌస్‌లో కేసీఆర్..ఏం చేస్తున్నారు ? పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ

10 రోజులుగా ఫాం హౌస్‌లో కేసీఆర్..ఏం చేస్తున్నారు ? పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ

KCR Farm House : ఏం చేసినా కలిసిరావట్లేదా? దీంతో మౌనమే బెస్ట్‌ అనుకున్నారా? మూడ్‌ ఆఫ్‌తో ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారా?…తెలంగాణ రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశమవుతోంది. కానీ కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంతకీ కేసీఆర్‌ ఏం చేస్తున్నారు? దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోయింది. జీహెచ్‌ఎంసీలో మెజార్టీ రాలేదు. అభివృద్ధి ఘనంగా చేశాం, మరే రాష్ట్రమూ అమలుచేయని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న టీఆర్‌ఎస్‌(TRS)కు..ఈ ఫలితాలు మింగుడుపడలేదు. అధికారపార్టీని ఆత్మరక్షణలో పడేసేలా వచ్చిన ఈ ఫలితాలను గులాబీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఆ పార్టీ అధినేత విశ్లేషణతో పాటు.. భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారట.

ఎర్రవల్లిలో కేసీఆర్ :-
10 రోజులుగా గులాబీదళపతి ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికే పరిమితమయ్యారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాలం కలిసి రాకపోతే కేసీఆర్‌ సైలంట్‌గానే ఉంటారు, అది ఆయన నైజం అనేవారూ ఉన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు..రాజకీయ ప్రత్యర్థులను మరింత అయోమయానికి గురిచేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తుంటారని చెప్పుకుంటున్నారు.

అపర చాణక్యుడిగా పేరు :-
ఉద్యమం, రాష్ట్ర సాధన, టీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు అధికారంలోకి తేవడంలో కేసీఆర్‌ది క్రియాశీలక పాత్ర. అపర చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్‌..ఫామ్‌ హౌజ్‌ నుంచే ఎన్నో సార్లు వ్యూహరచన చేసిన సందర్భాలున్నాయి. తుపానుకు ముందు ప్రశాంతత మాదిరి తమ అధినేత ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు కూడా ఆ తరహా స్కెచ్‌ ఏదో గీస్తుంటారని పార్టీ క్యాడర్‌తో పాటు రాజకీయ విశ్లేషకులూ చర్చించుకుంటున్నారు.

పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు :-
ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో మార్పులకు సిద్ధపడుతున్న కేసీఆర్‌…ప్రజల్లోకి కొంగొత్త వ్యూహాలతో వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న సంకేతాలతో…ఆ పార్టీకి కళ్లెం వేసే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు ఓ టాక్‌ నడుస్తోంది. అయితే ప్రధానంగా బీజేపీపై దూకుడు కనబర్చాలా? లేకపోతే వ్యూహాత్మకంగా వ్యవహరించాలా అనేదానిపైనే కసరత్తు చేస్తున్నారట.

కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు :-
తనయుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తే…అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇప్పట్నుంచే దృష్టి సారించినట్లు గులాబీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగిస్తే… పార్టీకి, ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలేంటి? రాజకీయంగా చర్చకు వచ్చే వాదనలేంటనే దానిపైనా వ్యవసాయక్షేత్రంలో చర్చిస్తున్నారట.
ఏదేమైనా కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది…అధికారపార్టీ నేతల్లో కూడా ఉత్కంఠ రేపుతోంది. త్వరలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కూడా ఉండడంతో పార్టీలో సరికొత్త జోష్‌ నింపేలా కేసీఆర్‌ నిర్ణయాలుంటాయని క్యాడర్‌ భావిస్తోంది.

×