ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ కాంగ్రెస్ పెద్దాయన ఇప్పుడెక్కడున్నారు? రిటైర్ అయినట్టేనా

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 12:09 PM IST
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ కాంగ్రెస్ పెద్దాయన ఇప్పుడెక్కడున్నారు? రిటైర్ అయినట్టేనా

where is jana reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కుందూరు జానారెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి అర్థం చేసుకోవాలంటే ఆషామాషీ విషయం కాదు. కాంగ్రెస్ లోనే కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఎన్ని గ్రూపులున్నా.. జానారెడ్డి స్టైల్ అందుకు భిన్నమనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆ పెద్దాయన ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లో కనిపించడం లేదంటున్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోగానే పూర్తిగా సైలెంట్:
రాజకీయాల్లో సీనియర్ అయిన జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఇతర పార్టీల నేతలు కూడా గౌరవిస్తారు. అంతెందుకు సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ఏర్పడిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో పదే పదే జానారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చేవారు. గత అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఉంటూ ప్రభుత్వానికి పలు సలహాలు సూచనలిస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడే వారు జానారెడ్డి. అలాంటి నేత గత ఎన్నికల్లో ఓడిపోగానే పూర్తిగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశం అయ్యింది.

రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికినట్టే:
దాదాపు రెండేళ్లుగా జానారెడ్డి జాడ కనిపించకుండా పోయిందని గాంధీభవన్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ వచ్చిన సందర్భంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సమావేశాలకు సైతం జానారెడ్డి దూరంగా ఉండడంతో ఇక రాజకీయాలకు ఆయన స్వస్తి పలికారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి చూస్తున్నారని అంటున్నారు.

ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తారని వార్తలు:
ఒకప్పుడు ఎప్పుడూ జనాల్లో, మీడియాలో కనిపించే జానారెడ్డి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం చూస్తుంటే.. ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తారని అంటున్నారు. తన వారసుడిని రంగంలోకి దించి, ఆయన తప్పుకుంటారని చెబుతున్నారు. ఆ నిర్ణయాన్ని జానారెడ్డే ప్రకటిస్తారో.. అసలు ఏ విషయాన్ని కూడా చెప్పకుండా మౌనంగానే తప్పుకుంటారో? చూడాల్సిందే.