నాగార్జున సాగర్ లో అభ్యర్థులెవరు? గెలుపెవరిది?

నాగార్జున సాగర్ లో అభ్యర్థులెవరు? గెలుపెవరిది?

Who are the candidates for contest in Nagarjuna Sagar? : ఎన్నికలొస్తే పొలిటికల్ పార్టీలకు ఉండే కిక్కే వేరు. ఎన్నిక ఏదైనా సమర శంఖం పూరించి.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దూకాల్సిందే. ఇప్పుడు నాగార్జునసాగర్‌లో ఇదే జరుగుతోంది. రాబోయే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టాయి రాజకీయ పార్టీలు. ఇంతకీ సాగర్‌లో ఆయా పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు?

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రభావం తగ్గిన అధికార టిఆర్ఎస్ కు సాగర్‌ బై పోల్ లో గెలుపు అనివార్యమైంది. అటు వరుసగా ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ నాగార్జునసాగర్‌లో కూడా పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఇప్పటికి ఏడుసార్లు విక్టరీ సాధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి ఎనిమిదో సారి గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఆయా పార్టీల తరుపున ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డినే పోటీలో ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కమ్ ఠాకూర్ ప్రకటించడంతో జానా పేరు లాంఛనమే కానుంది. జానారెడ్డి ఈ ఎన్నికల్లో బరిలో దిగనుండటంతో.. కాంగ్రెస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ నష్టనివారణ చర్యలపై ముఖ్యనాయకులు దృష్టిపెట్టారు. అందివచ్చిన నాగార్జున సాగర్‌ ఎన్నికలను అవకాశంగా మలచుకోవడానికి స్కెచ్‌లు వేస్తోన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం రెండు పర్యాయాలు మాత్రమే జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు చాలా అవసరమని కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది.

ఇక అధికార TRS నుంచి ఆశావాహుల జాబితా బాగానే ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తనయుడు నోముల భగత్‌తో పాటు గతంలో కూడా పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చిన ఆ పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, రంజిత్ యాదవ్, ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే ఇందులో నోముల కుటుంబానికి టికెట్ కేటాయిస్తే, తాము మద్ధతిస్తామని రవీందర్ రెడ్డి చెబుతున్నారు.

ఇక దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్‌తో… బిజెపి క్యాడర్‌లో నూతనుత్తేజం కనిపిస్తోంది. బిజెపి నుంచి గతంలో పోటీ చేసిన కంకణాల నివేదిత, కడారి అంజయ్య యాదవ్‌తో పాటు ఇటీవలే కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఇంద్రసేనారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేసిన నీవేదితకు డిపాజిట్ కూడా దక్కలేదు. గతంలో టిడిపి నుంచి పోటీ చేసిన కడారి అంజయ్య యాదవ్ 30 వేల ఓట్ల సాధించారు. ఆయనకు సామాజికవర్గం మద్ధతు బలంగా ఉండడం కలిసొచ్చే అంశం కాగా.. నివేదితకు పార్టీలో పైస్థాయి నేతల మధ్ధతు ఉండడం కలిసొచ్చే అంశంగా ఉంది.

ఇక జానారెడ్డి అనుచరుడిగా పేరున్న ఇంద్రసేనారెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయ్యాకనే బిజెపిలో చేరారనే ప్రచారం ఉంది. ఈ ముగ్గురిలో ఒకరికి బిజెపి నుంచి అవకాశం దక్కనుంది. అయితే జిల్లా నేతలు.. స్థానిక క్యాడర్ అభిప్రాయానికి పెద్దపీట వేస్తే.. కడారి అంజయ్య యాదవ్.. ఇంద్రసేనారెడ్డిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశముందని టాక్.

సీపీఎం నుంచి రైతుసంఘం నేత కున్‌రెడ్డి నాగిరెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పైకి టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోన్నా.. అసలు పోటీ మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాన్నిచ్చిన నాగార్జునసాగర్ ఓటర్లు.. ఈ ఉపఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.