పవన్‌ కళ్యాణ్‌కు ఎందుకంత అసహనం? బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టేనా?

జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌కు ఎందుకంత అసహనం? బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టేనా?

Pawan Kalyan Telangana Bjp

why pawan kalyan unhappy with telangana bjp: జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.

తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య అంతులేని గ్యాప్ ఏర్పడిందా? అంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా సైలెంట్ గా ఉన్న పవన్, బహిరంగంగానే తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేయడం చూస్తుంటే, ఇరువురి మధ్య గ్యాప్ కాస్త పెరిగి అగాధంగా మారినట్టు తెలుస్తోంది.

మామూలుగా అయితే సొంత పార్టీ ప్రయోజనాలకంటే పొత్తు పెట్టుకున్న వారి మేలు కోసమే ఎక్కువగా తాపత్రయ పడే పార్టీల్లో ముందు వరుసలో ఉంటుంది జనసేన. ఒకప్పుడు ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసింది. ఇక రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీతో కలిసి బలమైన పార్టీగా ఏర్పడటానికి పావులు కదుపుతోంది. మరికొద్ది రోజుల్లో జరిగే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనాని అభ్యర్థిని బరిలో నిలపకుండా బీజేపీకే మద్దతివ్వాలని నిర్ణయించారు.

ఇలా ఏపీలో, కేంద్రంలో బీజేపీతో అత్యంత సఖ్యతగా ఉండే జనసేన, తెలంగాణ బీజేపీ నేతలంటే మాత్రం మండిపడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు తెలిపింది జనసేన. అయితే కేంద్రం, ఏపీ బీజేపీ తమకు ఎంతో ప్రయారిటీ ఇస్తాయని, కానీ తెలంగాణ బీజేపీ మాత్రం తమను అవసరానికి వినియోగించుకుంటూ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వపన్ కళ్యాణ్. తెలంగాణ బీజేపీతో తాము కలిసి పని చేసేందుకు రెడీగా ఉన్నా, తెలంగాణ బీజేపీ నాయకత్వం అంటీముట్టన్నట్టు వ్యహరిస్తోందని పవన్ అన్నారు.

ఉన్నట్టుండి పవన్‌ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీపై ఉన్న కోపాన్నంతా జనసేన ఆవిర్భావ వేదికపై వెళ్లగక్కారు. జనసేన పార్టీని, నాయకులను తెలంగాణ బీజేపీ నేతలు చులకన చేసి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీతో సత్ససంబంధాలున్నా.. తెలంగాణ బీజేపీతో పొసగలేకపోతున్నామని చెప్పేశారు. ఇక్కడ జనసేన పార్టీకి బీజేపీ గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. తమకు గౌరవం లభించని చోటు తాము మాత్రం ఎదుటి వారికి గౌరవం ఎలా ఇస్తామని.. ఈ కారణంగానే జనసేన తెలంగాణ శ్రేణులు టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురు వాణిదేవికి మద్దతిస్తామంటే ఒప్పుకున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. సరిగ్గా పోలింగ్‌ రోజునే పవన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్‌ను విమర్శించిన పవన్‌ సడన్‌గా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వడం కాస్త గందరగోళానికి గురిచేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున తెలంగాణ బీజేపీ నాయకత్వంపై పవన్ మాట్లాడటం చర్చకు దారితీసింది. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని, అంతేకాకుండా భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇరుపార్టీల మధ్య గ్యాప్ ఏ మేరకు ఉందో అర్థం అవుతుంది.

తెలంగాణలో భవిష్యత్తులో జనసేన పోటీ చేసే విషయంపై కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జరగాల్సి ఉన్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటముల అంశాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నేతలకు సూచించారు. ఈ రకంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందని జనసేన బీజేపీకి సంకేతాలు ఇచ్చింది. దీంతో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒంటరి పోరుకు దిగుతామని జనసేన బీజేపీకి హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలని పవన్ ను కోరారు. అన్యాయం జరిగితే తమతో చర్చించాల్సి ఉండేదన్నారు. కానీ పోలింగ్‌ రోజే టీఆర్ఎస్‌ అభ్యర్థికి పవన్‌ మద్దతు ప్రకటించడంతో కాస్త బాధ కలిగిందన్నారు. పోలింగ్ రోజు బీజేపీపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన పవన్.. ఇప్పుడు సమర్థించటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. పవన్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే కేంద్ర నాయకత్వం లేదా తన దృష్టికి తీసుకురావాల్సిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల పొత్తు అంశం ఇరు పార్టీల మధ్య చర్చకు రాలేదని సంజయ్ ప్రకటించడం కూడా బీజేపీ-జనసేన మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తుంది.

తెలంగాణ బీజేపీకి పవన్‌ కల్యాణ్‌కు మొదటి నుంచి పెద్దగా సయోధ్య కుదరడం లేదు. మొన్న గ్రేటర్‌ ఎన్నికల్లోనే ఇదే స్పష్టమైంది. మొదట పవన్‌ కల్యాణ్‌ జనసేన తరఫున అభ్యర్థులను కూడా ప్రకటించారు. తర్వాత బీజేపీ అధిష్ఠానం సూచన మేరకు జనసేన వెనక్కితగ్గింది. అప్పటి నుంచే తెలంగాణ బీజేపీకి పవన్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పవన్‌ ఇప్పుడు సడన్‌గా బీజేపీపై విమర్శలు చేయడంతో గందరగోళం నెలకొంది. తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేనాని నజర్‌ పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో కలిసి పని చేస్తున్న బీజేపీ-జనసేన పార్టీలు తెలంగాణలో కలిసి పని చేస్తాయో లేదో అన్న విషయం రానున్న ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్, తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య గ్యాప్ ను సెట్ చేసేందుకు బీజేపీ అధిష్టానం కూడా రంగంలోకి దిగుతుంతో లేదో వేచి చూడాల్సి ఉంది.