స్థంభానికి కట్టేసి కొట్టిన భార్య బంధువులు.. యువకుడి ఆత్మహత్య!

కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పెళ్ళై నిండా ఏడాది తిరగకుండానే కూతురు పుట్టింది. కూతురు నెలల పాప ఉండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల పాపతో భార్య ఒంటరిగా మిగిలింది.

స్థంభానికి కట్టేసి కొట్టిన భార్య బంధువులు.. యువకుడి ఆత్మహత్య!

Wife Of Relatives Beaten Young Man Commits Suicide

కుటుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పెళ్ళై నిండా ఏడాది తిరగకుండానే కూతురు పుట్టింది. కూతురు నెలల పాప ఉండగానే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల పాపతో భార్య ఒంటరిగా మిగిలింది. హైదరాబాద్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్‌ డివిజన్‌, ఎస్‌పీఆర్‌ హిల్స్‌ సమీపంలోని అంజయ్యనగర్‌కు చెందిన దూసుముక్కు లక్ష్మణ్‌(26) పెయింటర్‌ గా పనిచేస్తున్నాడు.

ఏడాది క్రితం తెల్లాపూర్‌కు చెందిన భవానీతో వివాహం కాగా వీరికి 25 రోజుల పాప కూడా ఉంది. పెళ్లి జరిగిన సమయం నుండే భార్య కుటుంబంతో కలిసి ఉంటున్న లక్ష్మణ్ అప్పుడప్పుడూ రాజీవ్‌గాంధీనగర్‌లో ఉన్న బాబాయ్‌ ఇంటికి వస్తుంటాడు. పెళ్లి జరిగిన సమయం నుండే భార్య కుటుంబంతో కలిసి ఉండడం.. కరోనా లాక్ డౌన్ తో గత ఏడాది ఉపాధి లేకపోవడంతో తరచుగా భార్య బంధువులతో లక్ష్మణ్ కు గొడవలు జరుగుతుండేవి. మార్చి 31న పాప 21 రోజుల వేడుక జరగగా ఈ వేడుకలలో కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో భార్య బంధువులు లక్ష్మణ్ మీద చేయి చేసుకున్నారు.

తనను కొట్టారని కోపంతో లక్ష్మణ్ మద్యం సేవించి ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్య కుటుంబంతో మరోసారి గొడవకు దిగారు. ఆగ్రహించిన భార్య కుటుంబం, బంధువులు కలిసి లక్ష్మణ్ ను స్థంభానికి కట్టేసి కొట్టారు. అక్కడ నుండి బాబాయ్ ఇంటికి వచ్చిన లక్ష్మణ్ జరిగిన విషయం పిన్ని, బాబాయిలకు చెప్పి తాను బ్రతకానంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. పిన్ని, బాబాయ్ నచ్చజెప్పి భార్య కుటుంబంతో తాము మాట్లాడతామని.. స్థిమితంగా ఉండాలని కోరారు. అప్పటికి కాస్త కుదుటపడిన లక్ష్మణ్ కాసేపటికి తాను బయటకి వెళ్తున్నానని చెప్పి అక్కడ నుండి వచ్చేశాడు.

కానీ అదేరోజు బాబాయి ఇంటి కింద ఖాళీగా ఉన్న ఒక షట్టర్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోజు గడిచినా లక్ష్మణ్ ఆచూకీ లభించకపోగా బాబాయి, పిన్ని వెతుకుతూనే ఉన్నారు. కానీ ఈలోగా శనివారం షట్టర్ రూమ్ నుండి దుర్వాసన వస్తుండడంతో వెళ్లిచూడగా లక్ష్మణ్ మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించగా.. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.