మావోయిస్టులు కిడ్నాప్ చేసిన భర్తను రక్షించుకున్న కలియుగ సావిత్రి: పోలీసు భార్య సాహసం

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 08:09 AM IST
మావోయిస్టులు కిడ్నాప్ చేసిన భర్తను రక్షించుకున్న కలియుగ సావిత్రి: పోలీసు భార్య సాహసం

మావోయిస్టులు పోలీసుల్ని కిడ్నాప్ చేయటం చత్తీస్‌గఢ్‌లో అడవుల్లో సర్వసాధారణంగా జరిగే విషయం. అలా కిడ్నాప్ చేసిన పోలీసుల్ని మావోలు చంపేస్తుంటారు. అలా కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్ ని అతని భార్య పురాణకథల్లోని సతీ సావిత్రిలాగా తన భర్తను మావోయిస్టుల నుంచి ప్రాణాలతో కాపాడుకుంది. భర్త కోసం అలనాటి సావిత్రి యమధర్మరాజుతో పోరాడితే..మావోలు కిడ్నాప్ చేసిన పోలీసును అతని భార్య అత్యంత సాహసంతో అడవుల బాట పట్టి మావోలను కలిసి మాట్లాడి తన భర్తను రక్షించుకుని ‘కలియుగ సావిత్రి’ అయింది. మరి ఆ కలియుగ సావిత్రి  సాహసం కరడుకట్టిన మావోలకు కూడా కన్నీరు పెట్టించిన సినిమాలాంటి ఈ వాస్తవం గురించి తెలుసుకోవాల్సిందే.

చత్తీస్‌గఢ్‌ అడువుల్లో వారం రోజుల కిందట కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం ప్రజాకోర్టును నిర్వహించారు. బీజాపూర్‌ జిల్లా దుర్గం అడవుల్లో నిర్వహించిన ప్రజాకోర్టులో కిడ్నాప్ చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌కు ప్రాణభిక్ష పెట్టాలని నిర్ణయించారు. కారణం అతని భార్య మావోలను అర్థించటమే.
సుక్మా జిల్లా జేగురుకొండకు చెందిన సంతోష్ కట్టమ్ అనే 48 పోలీస్ కానిస్టేబుల్ బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మే మొదటివారంలో సంతోష్‌ను గోరానా గ్రామంలో మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇంటికి సరుకులు కొనటానికి వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవటంతో భార్య సునీత ఆందోళ చెందింది. అందరినీ అడిగింది. రాలేదని చెప్పటంతో మరింతగా భయపడింది. అలా రెండు రోజులకు సంతోష్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని తెలుసుకుంది. గుండెలు అద్దిరిపోయాయి. ఏం చేయాలో పాలుపోలేదు. పోలీసులకు చెప్పింది. భర్త స్నేహితులకు చెప్పింది. కానీ భర్త క్షేమం తిరగి వస్తాడో లేదోననే భయం ఎక్కువైంది. గతంలో ఎంతమంది పోలీసుల్ని మావోలు చంపేశారో సునీతకు తెలుసు. పోలీసులు ఏదో చేస్తారని చూస్తు కూర్చునేకంటే తానే ఏదో చేయాలని అనుకుంది. అలా ఆలోచిస్తూ కూర్చుంటే జరగరానిదేనన్నా  జరిగితే..అనే ఆలోచన సునీతను కుదురుగా ఉండనివ్వలేదు. అంతే అడవిబాట పట్టాలని నిర్ణయించుకుంది!!

సునీత నిర్ణయం విని కుటుంబ సభ్యులు..స్థానికులు హడలిపోయారు. వద్దన్నారు. బతిమాలారు. నీ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. కానీ ఆమె వినలేదు. అలా మే 6న తన ఇద్దరి పిల్లలను మిగతా కుటుంబసభ్యులకు అప్పగించింది.తన మరో 14 ఏళ్ల కూతురు..స్థానిక జర్నలిస్ట్ తో పాటు కొంత మంది గ్రామస్థులతో కలిసి అడవికి బయలుదేరింది!!. నాలుగు రోజుల పాటు అడవుల్లో ప్రయాణించి మే 10న ఎట్టకేలకూ నక్సల్స్ ఉండే స్థావరానికి చేరుకుంది. తన పరిస్థితిని..కుటుంబ పరిస్థితిని మావోయిస్టులకు వివరించింది. 

దీంతో మావోయిస్టులు ప్రజాకోర్టును నిర్వహించారు. ప్రజాకోర్టులో మావోలను సునీత వేడుకుంది. దయచేసిన నాభర్తకు ప్రాణభిక్ష పెట్టాలని సునీత కన్నీటితో వేడుకుంది. కన్నీటితో ఆమె వేడుకునే తీరును చూసిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు కరడుకట్టిన మావోలు కూడా సునీత వేడుకోలును..అభ్యర్ధించే తీరుకు కన్నీటి పర్యంతమయ్యారు.   

దీంతో ప్రజాకోర్టులో తీసుకున్న నిర్ణయం ప్రకారం మావోయిస్టులు సంతోష్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. పోలీస్ డ్యూటీ మానేయమని హెచ్చరించారు. లేకుండా ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నక్సల్స్ హెచ్చరించినట్లుగా సమాచారం. ఓ మహిళ తన భర్త రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడదని సునీత నిరూపించింది. కలియుగ సతీ సావిత్రి అనిపించుకుంది. 

ఇంత ప్రమాదకరమైన సాహసం ఎలా? సునీతను ప్రశ్నించగా..మనకు సమస్య వచ్చిందని విచారిస్తూ కూర్చునే కంటే మనమే దాన్ని పరిష్కరించుకోవటానికి యత్నించాలని..అలా తాను అడవులకు వెళ్లి మావోలను కలిసాక ఆరు రోజుల తరువాత మావోల ప్రజాకోర్టులో తన భర్తను చూశానని..ఆయన్ని చూడగానే ఎంతో సంతోషం వేసిందని చెప్పింది. తన భర్తను మావోలు విడిచిపెట్టం చాలా చాలా సంతోషంగా ఉందని..తన భర్త క్షేమంగా ఉండటంతో తాను పడిన కష్టం మరచిపోయాననీ..ఇది మా జీవితాల్లో మరచిపోలేని రోజుని సంతోషంగా చెప్పింది సునీత. కాదు కాదు కలియుగ సతీ సావిత్రి. 

కాగా..సంతోష్ ను పోలీసు ఉద్యోగం నుంచి తప్పుకోవాలని..అలా అని మాట ఇస్తేనే సంతోష్ ను విడిచిపెడతామని దానికి సునీత హామీ ఇస్తేనే విడిచిపెడతామని కండిషన్ పెట్టినట్లుగాను..దానికి సునీత ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కానిస్టేబుల్ సంతోష్ ను మావోలు విడిచిపెట్టారనీ..దీనికి సంబంధించి సంతోష్ పోలీసు ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

Read Here>> కారుపైకి ఎక్కిందని వీధికుక్కను తుపాకీతో కాల్చి చంపేశాడు..