Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇందులో నిజమెంత? భయాందోళనలో ప్రజలు

టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్‌ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్‌ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగిపోతోంది.

Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇందులో నిజమెంత? భయాందోళనలో ప్రజలు

Corona Vaccine

Corona Vaccine : దేశంలో విలయతాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అందుకే ప్రజలందరికి వ్యాక్సిన్ వేసే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. టీకా తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో జనాలు టీకా కోసం క్యూ కట్టారు.

కాగా, ఇక్కడో సమస్య వచ్చింది. టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్‌ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్‌ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగిపోతోంది.

దీనికి వైద్యులు క్లారిటీ ఇచ్చారు. అసలు విషయం ఏంటో వారు చెప్పారు. టీకా వల్ల కొవిడ్‌ వచ్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. 90 శాతం టీకా కేంద్రాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు లక్షణాలున్న వారు కూడా ముందుగా పరీక్ష చేయించుకోకుండా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల తర్వాత బయటపడుతోందని డాక్టర్ల పరిశీలనలో తేలింది.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజూ దాదాపు 300 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ కేంద్రాలు తదితర చోట్ల టీకా వేస్తున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55 లక్షలమందికి మొదటి, రెండో డోసులు వేశారు. ఇందులో 60 శాతం వరకు హైదరాబాద్‌లోనే వేశారు. మహానగరం పరిధిలో చాలా వరకు వ్యాక్సిన్‌, కరోనా పరీక్షా కేంద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. ఒక లైనులో అనుమానితులు నిల్చుంటే వారి పక్కనే టీకా కోసం వచ్చిన వారు నిలబడుతున్నారు. ఈ సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల టీకాకు వచ్చినవారు మహమ్మారి బారినపడుతున్నారు.

కొన్ని చోట్ల టీకా కేంద్రాలను శానిటైజ్‌ చేయకపోవడంతో ఇవి వైరస్‌ వ్యాప్తి కేంద్రాలుగా మారాయన్న భావన ఉంది. దీంతో వైరస్‌ కారణంగా జ్వరం వచ్చినా కూడా చాలామంది టీకా వల్ల వచ్చిందన్న భావనలో ఉంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. సాధారణంగా వ్యాక్సిన్‌ వల్ల వచ్చిన జ్వరం, ఒళ్లు నొప్పులు చాలా వరకు ఒక్క రోజుగానీ రెండో రోజుకు తగ్గిపోతాయి. అంతకు మించి ఇబ్బంది కలిగినా అలసత్వం ప్రదర్శిస్తుండడంతో కొందరు ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది.

డాక్టర్ల క్లారిటీ:
* టీకా వేయించుకోవడం వల్ల కరోనా వస్తుందన్నది అపోహ. మృతవైరస్‌తో వ్యాక్సిన్‌ తయారు చేశారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.
* చాలామంది ఇళ్లలో ఒకరిద్దరు కుటుంబ సభ్యులకు కరోనా వస్తే తాము కూడా ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందన్న భయంతో వెంటనే టీకాకు పరుగులు పెడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇలా చేయొద్ధు. 14 రోజులపాటు వారూ ఐసోలేషన్‌లో ఉండి ఆ తర్వాత వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతే వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.
* టీకా వేయించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మాస్కులను ధరించాలి.

లక్షణాలుంటే పరీక్ష చేయించుకున్న తర్వాతే టీకా తీసుకోవడం మేలు:
* వ్యాక్సిన్‌ వేయించుకునే ముందు జ్వరంగాని ఇతర లక్షణాలు గానీ ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన తర్వాతే టీకా వేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం టీకా వేయించుకోవడానికి ఆరు నెలలు ఆగాల్సిందే.

* చాలామంది మొదటి డోసు తర్వాత కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రెండో డోసు వేయించుకున్న 14 రోజుల తరువాతే మనలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దీని తర్వాత కూడా కరోనా రాదని కాదు. చాలా మందికి వచ్చినా కూడా సీరియస్‌ కావడం లేదు.

* అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు వృద్ధి చెందడంతో అక్కడ మాస్కును పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. బ్రిటన్‌లో కూడా అంతే. అందువల్ల ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

* టీకా వేయించుకున్న తర్వాత ఎక్కువ రోజులు జ్వరం ఇతర లక్షణాలున్నా ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఫలితం ఆధారంగా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.