ముంబై, అహ్మదాబాద్‌లో సక్సెస్ అయిన ఫార్ములా హైదరాబాద్‌లోనూ అవుతుందా? బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా?

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 03:07 PM IST
ముంబై, అహ్మదాబాద్‌లో సక్సెస్ అయిన ఫార్ములా హైదరాబాద్‌లోనూ అవుతుందా? బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా?

bjp ghmc elections: హైదరాబాద్‌లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు చాప‌ కింద నీరులా తమ పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో రెండు పార్టీలు డీ అంటే ఢీ అన్న విషయం తెలిసిందే. మరోపక్క తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న కమలం పార్టీ సైతం గ్రేటర్ పోరులో తమ సత్తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. గ్రేటర్‌లో ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా గ్రౌండ్‌ను సైతం ప్రిపేర్ చేసుకుంటోంది.

టీఆర్ఎస్-ఎంఐఎం ముక్త్ హైదరాబాద్‌:
మరోవైపు బల్దియా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎంలపై దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోందని చెబుతున్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం ముక్త్ హైదరాబాద్‌ పేరుతో గ్రేటర్ ఎన్నికల్లో తలపడాలని కమలనాథులు నిర్ణయానికొచ్చారని అంటున్నారు. టీఆర్ఎస్-ఎంఐఎంను ఓడించి హైదరాబాద్‌ను రక్షించుకుందామని ఓటర్లకు పిలుపునివ్వాలని కాషాయ పార్టీ భావిస్తోందట. ఇదే అంశాన్ని పదే పదే సభల్లో, సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారని చెబుతున్నారు.

30కి పైగా స్థానాలను ఈజీగా గెలుచుకోవచ్చని బీజేపీ అంచనా:
జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉంటే అందులో 40 డివిజన్లలో తాము బలంగా ఉన్నామని కమలనాథులంటున్నారు. టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎన్నికల ప్రణాళికను రచిస్తే.. 30కి పైగా స్థానాలను ఈజీగా గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారట. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్ పార్లమెంట్‌ స్థానం నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు.

ముంబై, అహ్మదాబాద్ లో సక్సెస్ అయిన ఫార్ములాతో హైదరాబాద్ లో:
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను నియమించి బీజేపీ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. రంగారెడ్డి అర్బన్‌కు సామ రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్‌కు హరీశ్‌ రెడ్డి, గోల్కొండ-గోషామహల్‌కు పాండు యాదవ్, భాగ్యనగర్-మలక్ పేటకు సమర్ రెడ్డి సురేందర్ రెడ్డి, మహంకాళీ సికింద్రాబాద్‌కు శ్యామ్ సుందర్ గౌడ్, బర్కత్‌పుర-అంబర్ పేట్‌కు గౌతమ్‌రావ్ నియమించారు. గ్రేటర్‌లో లోకల్‌ లీడర్‌షిప్‌ను పెంచడానికి ఆరుగురు అధ్యక్షుల ఫార్ములా తీసుకొచ్చిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముంబై, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ఇదే ఫార్ములా విజయవంతమైందని గుర్తు చేస్తున్నారు.

వర్షాలు, వరదలు బీజేపీకి కలసి వస్తాయని ఆశలు:
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు బీజేపీకి కలసి వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎక్కడ చూసినా కాలనీల్లో నీళ్లు రావడం, బస్తీలు మురికికూపాలుగా మారడం లాంటి వాటితో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేందుకు అవకాశం దక్కిందని అంటున్నారు. ఆరుగురు అధ్యక్షులకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయట. సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి కేంద్రమంత్రి తెలియజేయడం, ఆయన బస్తీల పర్యటన చేయడం వ్యూహంలో భాగమే అంటున్నారు. మరి ఈ కొత్త అధ్యక్షులు ఏ మేరకు ప్రజలకు దగ్గరవుతారో చూడాల్సిందే.