నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి

నీ గట్స్‌కు హ్యాట్సాఫ్.. రాత్రి వేళ దొంగను వెంటాడి పట్టుకున్న యువతి

woman catches thief in hyderabad: తన సెల్ ఫోన్ లాక్కుని పారిపోతున్న దొంగను వెంటాడి మరీ పట్టుకుందా యువతి. ఏమాత్రం అధైర్య పడకుండా, సాయం కోసం ఎదురుచూడకుండా, రాత్రి వేళ అని కంగారుపడకుండా ఎంతో సాహసంగా దొంగ వెంట పడింది. ఈ క్రమంలో దొంగను పట్టుకుని తన సెల్ ఫోన్ దక్కించుకుంది. అంతేకాదు ఆ దొంగను కటకటాల్లోకి పంపించింది. హైదరాబాద్ యూసుఫ్ గూడ్ లో జరిగిన ఈ ఘటనలో యువతి ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహస నారి అని అంతా పొగుడుతున్నారు.

సికింద్రాబాద్‌కు చెందిన భూమిక(29) అనే యువతి ఓ బొటిక్‌లో డిజైనర్‌గా పనిచేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని త‌న ఆఫీసులో డ్యూటీ ముగించుకుని మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ ‌దగ్గర మెట్రో రైలు ఎక్కేందుకు న‌డుచుకుంటూ వెళ్తోంది.

అదే స‌మ‌యంలో ఫోన్ రావ‌డంతో మాట్లాడుతూ న‌డుస్తోంది. ఇంతలో యువతి వెనకాలే వ‌చ్చిన ఓ దొంగ ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కొని కృష్ణానగర్ వైపు పరుగు తీశాడు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటనతో భూమిక బిత్తరపోయింది. ఆ తర్వాత క్షణాల్లోనే తేరుకుంది. దొంగ, దొంగ అని అరుస్తూ అతడి వెంట పడింది. అలా 600 మీటర్లు పరిగెత్తింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ బైకర్ సాయాన్ని తీసుకుంది. అతడి బైక్ ఎక్కి దొంగను వెంబడించింది. దొంగ, కృష్ణానగర్ లోని సింధు టిఫిన్స్ సెంటర్ దగ్గర ఉన్న సందులోకి దూరడాన్ని ఆమె చూసింది. అక్కడే ఓ గోడ పక్కన అతడు దాక్కుని ఉండటాన్ని గమనించింది. వెంటనే అతడిని పట్టుకుని తన మొబైల్ ను లాక్కుంది భూమిక.

ఇంతలో స్థానికులు కూడా వచ్చి భూమికకు సాయం చేశారు. దొంగ పారిపోకుండా ప‌ట్టుకున్నారు. భూమిక 100కి ఫోన్‌‌ చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని దొంగ‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఆ దొంగ, సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడని తెలిసింది. మొత్తానికి ఎంతో ధైర్య సాహసాలతో రాత్రి సమయంలో కూడా దొంగ వెంట పడి తన మొబైల్ ను సంపాదించుకున్న భూమికను పోలీసులు, స్థానికులు ప్రశంసంలతో ముంచెత్తారు. భూమిక గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పారు.