కరోనా రోగుల మృతదేహాలకు ఉచితంగా కలప

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి మృతదేహాల దహనానికి కట్టెలు కూడా కరువయ్యాయి. సాధారణ మరణాలకు తోడు కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్మశానాల్లో కలప కొరత ఏర్పడింది.

కరోనా రోగుల మృతదేహాలకు ఉచితంగా కలప

Covid Patients Crematorium

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి మృతదేహాల దహనానికి కట్టెలు కూడా కరువయ్యాయి. సాధారణ మరణాలకు తోడు కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్మశానాల్లో కలప కొరత ఏర్పడింది.

ఈ సమస్యను అధిగమించేందుకు తమవంతుగా సహాయం అందించాలని తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌డీసీ) నిర్ణయించింది. సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరాచేస్తామని టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏటా పెద్ద ఎత్తున ప్లాంటేషన్‌ చేపడుతారు. ఈ కలపను కార్పొరేషన్‌ నుంచి పేపర్‌ మిల్లులు సేకరిస్తాయి. అమ్మగా మిగిలిన సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్‌తోపాటు సమీప మున్సిపాలిటీల స్మశానాలకు అంత్యక్రియల కోసం సరఫరా చేస్తామని ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఈ కలప విలువ రూ.20 లక్షలు ఉంటుందని చెప్పారు.

మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసుకొంటూ కలపను సరఫరా చేస్తామని కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ జీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

రంగారెడ్డి డివిజన్‌లో 3,500 టన్నులు, ఖమ్మం-సత్తుపల్లి- అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 4,000 టన్నులు, మంచిర్యాల-కాగజ్‌నగర్‌లో 860 టన్నులు, వరంగల్‌ డివిజన్‌లో 200 టన్నుల కలప అందుబాటులో ఉందని వెల్లడించారు. అంత్యక్రియలకు అవసరమైన వెదరును కూడా సరఫరా చేస్తామని తెలిపారు.

హైదరాబాద్‌ పరిధిలో అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఆసిఫ్‌నగర్‌, ఈఎస్‌ఐ స్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామని చెప్పారు. అంత్యక్రియలకు కలప దొరకని పేదలు స్థానిక మున్సిపల్‌ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు. కలపను తరలించేందుకు స్థానిక లారీఓనర్స్‌ అసోసియేషన్లు కూడా ముందుకు వచ్చాయని చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు.