Covid 19 Vaccine : జాగ్రత్త… వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రావొచ్చు..

హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే.

Covid 19 Vaccine : జాగ్రత్త… వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రావొచ్చు..

Covid 19 Vaccine : హమ్మయ్య.. వ్యాక్సిన్ తీసుకున్నాం. ఇక భయం లేదు. కరోనా రాదు అని బిందాస్ గా ఉన్నారా? ఇష్టం వచ్చినట్టు బయట తిరిగేస్తున్నారా? భౌతిక దూరం పాటించడం లేదా? మాస్కు పెట్టుకోవడం లేదా? అయితే మీకు మూడినట్టే. చావుతో గేమ్స్ ఆడినట్టే. కచ్చితంగా మీకు కరోనా వచ్చే చాన్స్ ఉన్నట్టే. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా ముప్పు తొలగలేదని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా తీసుకున్న వారికీ కరోనా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ (ప్రజారోగ్య శాఖ) డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

పండుగల(హోలీ, ఈస్టర్, ఉగాది) దృష్టా ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతికదూరం చాలా ముఖ్యం అన్నారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ పై భయాందోళన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన వారిని త్వరగా గుర్తిస్తే మంచిదని లేదంటే కరోనా బాధితుడు ఐదారుగురికి వైరస్ వ్యాప్తి చేస్తాడని తెలిపారు.

తెలంగాణలో కరోనా అదుపులో ఉందని డీఎంహెచ్ వో రమేష్‌ రెడ్డి తెలిపారు. కాగా కోవిడ్ సెకండ్‌ వేవ్ మొదలైందని.. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని కోరారు. తెలంగాణలో కోటికిపైగా కరోనా టెస్టు‌లు చేసినట్లు డీఎంహెచ్ వో వెల్లడించారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచామన్నారు. తెలంగాణ పాజిటివిటి రేట్‌ 0.6శాతం నమోదైందన్నారు.

కాగా, వ్యాక్సినేషన్‌కు ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 24లక్షల 49వేల 330 వాక్సిన్ డోసులు రాగా.. వాటిలో 12లక్షల డోసులు వినియోగించినట్టు తెలిపారు. 0.7 శాతం డోసులు మాత్రమే వృథా అయినట్లు చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో రమేష్‌ రెడ్డితో కలిసి డాక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి:
టీకా తీసుకున్నాం కదా, ఇక మునుపటిలా ఎక్కడికైనా వెళ్లొచ్చని అనుకోవటానికి లేదు. టీకా తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ అసలే రాదని చాలామంది భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. టీకాతో జబ్బు తీవ్రం కావటం పూర్తిగా ఆగిపోవచ్చు గానీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకూడదనేమీ లేదు. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన ఒకొకరిలో ఒకోలా ఉంటుంది. వ్యాక్సిన్ సామర్థ్యం 80% అనుకుంటే.. దీన్ని తీసుకున్నవారిలో నూటికి 80 మందికి రక్షణ కల్పిస్తుందని అర్థం. వీరికి ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా రక్షణ లభించొచ్చు లేదూ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా రోగనిరోధక వ్యవస్థ వైరస్‌ను త్వరగా నిర్మూలించటం వల్ల లక్షణాలేవీ తలెత్తకపోవచ్చు. మిగతా 20% మందికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమైతే ఉంటుంది. కానీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రం కాకపోవచ్చు.

* టీకా రెండు డోసులు(మోతాదులు) తీసుకున్నాక 2 వారాల తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. టీకా తీసుకున్న వారికీ వైరస్‌ సోకొచ్చు. అంత ఎక్కువగా కాకపోయినా వీరి నుంచీ ఇతరులకు వైరస్‌ వ్యాపించొచ్చు. అందువల్ల మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. ఎక్కువ మందికి టీకాలు ఇవ్వటం వల్లనో, సామూహిక రోగనిరోధకశక్తి సంతరించుకోవటం వల్లనో మరో 3, 4 నెలల్లో కరోనా నుంచి పూర్తిగా బయటపడే అవకాశముంది. కనీసం అప్పటివరకైనా అప్రమత్తంగా ఉండటం మంచిది. లేకపోతే పరిస్థితి దిగజారిపోవచ్చని నిపుణులు హెచ్చరించారు.

* బయటకు ఎక్కడికి వెళ్లినా విధిగా మాస్కు ధరించాలి.
* ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి.
* తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కునే వీలు లేకపోతే చేతులకు శానిటైజర్‌ రాసుకోవాలి.
వీటిని కచ్చితంగా పాటించటం మనందరి విధి. బాధ్యత. వీటితో కరోనా జబ్బు బారినపడకుండా చాలావరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.