రేవంత్‌ను సూరీడు ఎందుకు కలిశారు? రాజకీయాల్లోకి రాబోతున్నారా?

రేవంత్‌ను సూరీడు ఎందుకు కలిశారు? రాజకీయాల్లోకి రాబోతున్నారా?

sureedu attends revanth reddy : వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి సూరీడు. వైఎస్‌ పక్కనో, వెనకాలో కనిపించేవారు. వైఎస్ ఎక్కడున్నా వెన్నంటే ఉండేవారు. పొట్టి, నల్ల ముఖం, సపారీ సూట్‌, తెల్ల జుట్టు ఇవన్నీ సూరీడును ఇట్టే గుర్తుకు తెస్తాయి. వైఎస్‌ అనుంగుశిష్యుడు, నమ్మినబంటుగా పాపులర్‌ అయిన సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరీడు.. వైఎస్‌ ఉన్నంతకాలం అందరి నోళ్లలో నానారు. వైఎస్‌ మరణంతో ఆయన కుటుంబానికి సైతం కానరాకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు.

కొంతకాలం తర్వాత అడపాదడపా కనిపించినా జగన్‌తో చనువుగా ఉండలేకపోయారు. జగన్‌తో కలిసి కనిపించిందీ లేదు. వైఎస్‌ కుటుంబసభ్యులతోనే కాదు, మీడియాలోనూ కనిపించింది లేదు. అలాంటి సూరీడు గురించి ఇటీవల ఒక ప్రచారం జరిగింది. షర్మిల పెట్టనున్న పార్టీలో చేరతారని, ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని టాక్‌ వినిపించింది. కానీ ఇంతలోనే తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభలో ప్రత్యక్షమయ్యారు. అంతే కాదు..సభావేదికమీదనే రేవంత్‌ను సన్మానించారు. దీంతో సూరీడు మరోసారి హాట్‌టాపిక్‌ అయ్యారు. ఇంతకీ సూరీడు రేవంత్‌ను ఎందుకు కలిశారు? రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ అంటే సూరీడుకు విపరీతమైన అభిమానం. ఎంత అభిమానం ఉన్నా.. సీమాంధ్రకు చెందిన వ్యక్తి ఏపీ పార్టీలో కనిపిస్తే ఒకలా ఉండేది కానీ…. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి వెంట, అది కూడా రైతు రణభేరి బహిరంగ సభలో పాల్గొనడం వెనుక ఆంతర్యమేంటన్నది రాజకీయ విశ్లేషకులకు సైతం అర్థం కావట్లేదు. జగన్ కేసుల్లో సీబీఐ ముందు హాజరైన తర్వాత దాదాపు..10 ఏళ్లకు పైగా అజ్ఞాతవాసం చేశారు సూరీడు. దాదాపు 12 ఏళ్లకు ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యేసరికి..ఎందుకు కలిసారోనంటూ ఓ చర్చ నడుస్తోంది. షర్మిల పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన చేశాక..తెలంగాణ పాలిటిక్స్‌లో సూరీడు యాక్టివ్ కావడం వెనుక ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సూరీడు కాకతాళీయంగానే కలిసారా…లేకపోతే రేవంత్‌తో ముందునుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద సూరీడు ఎంట్రీ.. ఎటు అడుగులు వేయిస్తుందనేది మరింతగా ఉత్కంఠను పెంచేస్తోంది.