లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల షిఫ్ట్, ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ ఫొటో

లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల షిఫ్ట్, ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ ఫొటో

ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొత్త పార్టీ సంకేతాలను ఖండిస్తూ వచ్చిన షర్మిల.. చివరికి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులు, సన్నిహితులతో షర్మిల కీలక సమావేశం అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పుట్టించింది.

షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆమె మకాం మార్చారు. లోటస్ పాండ్ నుంచి గచ్చిబౌలికి షర్మిల ఫిష్ట్ అయ్యారు. గచ్చిబౌలి కేంద్రంగానే షర్మిల కొత్త పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారనే సమాచారం అందుతోంది. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు షర్మిలకు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక షర్మిల కొత్త పార్టీ పేరు రాజన్న రాజ్యంగా తెలుస్తోంది.

ఇవాళ(ఫిబ్రవరి 9,2021) వైఎస్ఆర్-విజయమ్మ వివాహ దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని షర్మిల కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది. కాగా, లోటస్ పాండ్ దగ్గర ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లోటస్ పాండ్ దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో వైఎస్ఆర్, షర్మిల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా కూడా సీఎం జగన్ ఫొటో లేదు. అంతేకాదు విజయమ్మ ఫొటో కూడా లేదు. ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

కాగా, ఆత్మీయ సమావేశానికి 50మందికే ఆహ్వానం అందింది. తెలంగాణ వైసీపీ నేతలకు మాత్రం ఆహ్వానం అందలేదు. షర్మిల పిలుపుతో వైఎస్ఆర్ అభిమానులు లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు.