పార్టీ ఏర్పాటుపై వేగం పెంచిన వైఎస్ షర్మిల..జెండా, సిద్ధాంతం కోసం ఎక్స్‌పర్ట్‌ కమిటీ

తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్‌ షర్మిల.. ఆ వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమవుతున్న ఆమె.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

పార్టీ ఏర్పాటుపై వేగం పెంచిన వైఎస్ షర్మిల..జెండా, సిద్ధాంతం కోసం ఎక్స్‌పర్ట్‌ కమిటీ

YS Sharmila speed up party formation : తెలంగాణలో త్వరలో పార్టీ ఏర్పాటు చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన వైఎస్‌ షర్మిల.. ఆ వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమావేశమవుతున్న ఆమె.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మాములగా అయితే పార్టీ ఏర్పాటు చేశాక.. గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు. కానీ తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్‌ షర్మిల అడ్వాన్స్‌గా ఆలోచిస్తున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందే.. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుపై దూకుడు మీదున్న షర్మిల.. గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పార్టీ ముఖ్య అనుచరులతో సమావేశమైన షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16 లోగా.. ఒక్కో మండలానికి ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను ముఖ్య అనుచరుడైన పిట్టా రామ్‌రెడ్డికి అప్పగించారు. అయితే పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి అండగా ఉన్న వైఎస్సార్ అభిమానులతోనే కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

షర్మిల ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ జెండా, సిద్ధాంతాల కోసం ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉండనున్నారు. జెండాలో కూడా నాలుగు రంగులు ఉండనున్నాయి. విప్లవం, శాంతికి గుర్తుగా ఎరుపు, తెలుపు రంగులు… సాగునీరు, పచ్చని పైరులకు సంకేతంగా నీలం, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే వారంలో జెండా తయారీ పూర్తి కానుందని తెలుస్తోంది. అంతేగాకుండా ఎక్స్‌పర్ట్‌ కమిటీ 15రోజుల్లో పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను కూడా రూపొందించనుంది.

మరోవైపు షర్మిలను కలిసేందుకు వచ్చే అభిమానులు, నేతలతో లోటస్‌ పాండ్‌ పరిసరాలు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి. శబ్ధాలు, ట్రాఫిక్‌జామ్‌లతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే విషయంపై పలుమార్లు స్థానికులు షర్మిల కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లోనూ కంప్లైంట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. విషయం షర్మిల దృష్టికి రావడంతో ఇకపై మీటింగ్స్‌ను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరపాలని నిర్ణయించినట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ రెండు రోజుల్లో జరిగిన సమావేశాలు ఎలాంటి హడావుడి లేకుండా నిర్వహించారు.