Sharmila Padayathra: మళ్లీ షర్మిల పాదయాత్ర మొదలయ్యేనా..?

వైఎస్‌ షర్మిల పాదయాత్ర ఎప్పుడూ? ఆ పార్టీ నేతలకు కూడా సమాధానం తెలియని ప్రశ్నే ఇది.

Sharmila Padayathra: మళ్లీ షర్మిల పాదయాత్ర మొదలయ్యేనా..?

Ys Sharmila Padayatra

Sharmila Padayathra: వైఎస్‌ షర్మిల పాదయాత్ర ఎప్పుడూ? ఆ పార్టీ నేతలకు కూడా సమాధానం తెలియని ప్రశ్నే ఇది. గతంలో పాదయాత్రను ప్రకటించి కొన్నిరోజులు యాత్ర చేసిన షర్మిల తర్వాత ఎన్నికల కోడ్‌తో ఆగిపోయారు. కానీ మళ్లీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు.. అప్పుడప్పుడు అక్కడక్కడా ఓదార్పు యాత్రలు చేస్తున్నా కూడా ఎక్కడా ఆమె కనిపించట్లేదు. పాదయాత్ర ప్రస్తావన రావట్లేదు.

ఇప్పటికే తెలంగాణలో పార్టీలు ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సన్నద్ధమయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. బీజేపీపై పోరుకు దిగారు. అటు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. నాయకులు పూర్తిగా జనంలోనే ఉంటున్నారు. ఏదో ఓ నిరసన కార్యక్రమం పెట్టుకుని మరీ జనంలోకి వెళుతున్నారు. ఇలా తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతుంటే, షర్మిల మాత్రం సైలెంట్‌ అయిపోయారు.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి, మూడు నెలలకే పాదయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ షర్మిల.. ఏడాదిపాటు పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే 4వేల కిలోమీటర్లు, 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దాదాపు 22 రోజులపాటు ఆమె యాత్ర సాగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా.. ఆమె పాదయాత్రకు బ్రేక్ పడింది.

ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసి నెల రోజులు దాటినా షర్మిల పాదయాత్ర మాత్రం మొదలుకావడం లేదు. షర్మిల చేసిన పాదయాత్రకు అనుకున్నంత స్పందన రాలేదనే చెప్పాలి. పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల సీజన్ కావడంతో.. షర్మిల పాదయాత్రకు జనం కరువయ్యారు. దీంతో షర్మిల పాదయాత్రను నిర్వాహకులు కష్టం మీదే ముందుకు సాగించారు.

ప్రస్తుతం షర్మిల పాదయాత్రకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కొందరు చెబుతుంటే.. పాదయాత్రకు శాశ్వత బ్రేక్ వేసి.. ఏదో ఒక సమస్యపై యాత్రలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు.. షర్మిలకు అత్యంత దగ్గర సన్నిహితులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం సంక్రాంతి తరువాత షర్మిల పాదయాత్ర ఉంటుందని అంటున్నారు.

అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. షర్మిల మాత్రం పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు పాదయాత్రకు బ్రేక్ వేసి.. ఎన్నికల సమయం వరకూ యాత్రలతో జనంలో ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.