మంగుళూరు నుంచే!: ఆప్ తరపున బరిలోకి ప్రకాష్ రాజ్?

  • Published By: venkaiahnaidu ,Published On : January 5, 2019 / 05:26 AM IST
మంగుళూరు నుంచే!: ఆప్ తరపున బరిలోకి ప్రకాష్ రాజ్?

రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన నటుడు ప్రకాష్ రాజ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. కొన్నిరోజులుగా ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మంగళవారం తాను స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమయంలో శుక్రవారం బెంగళూరులో పార్టీ వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్న ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకాష్ రాజ్ కు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు.

 
రాజకీయాల్లోకి ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సిసోడియా అన్నారు. మంచివాళ్లందరూ రాజకీయాల్లోకి వస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని అన్నారు. తన పొలిటికల్ జర్నీకి మద్దతు ప్రకటించిన ఆప్ ,మనీష్ సిసోడియాకు ప్రకాష్ రాజ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రకాష్ రాజ్ కు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తన మద్దతు తెలియజేసింది. మరోవైపు ప్రకాష్ రాజ్ ఎక్కడినుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇవ్వనప్పటికీ ఆయన మంగుళూరు నుంచి ఆప్ తరపున పోటీ చేయనున్నట్లు కర్ణాటకలో ప్రజలు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి బహిరంగ ప్రకటన చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ ను జేడీయూ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక నుంచి బరిలోకి దింపాలని కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.