ఢిల్లీలో చంద్రబాబు: ధర్మ పోరాట దీక్షకు రూ.2కోట్ల ప్రభుత్వ ఖర్చు

ఢిల్లీలో చంద్రబాబు: ధర్మ పోరాట దీక్షకు రూ.2కోట్ల ప్రభుత్వ ఖర్చు

ధర్మ పోరాట దీక్ష చేస్తానని ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీక్ష ప్రయోజనం ఏ మేరకు ఉందని, రూ.2కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాయి. కొద్దిరోజుల ముందే ప్రకటించిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో పాల్గొనే వారిని ఢిల్లీ తీసుకెళ్లడం కోసం ఏపీ ప్రభుత్వం రెండు రైళ్లను అద్దెకు తీసుకుంది. ఒక రైలు అనంతపురం నుంచి, మరొకటి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వెళ్తున్నాయి. 

 

శ్రీకాకుళం నుంచి వెళ్లే రైలు కోసం దక్షిణ మధ్య రైల్వేకి రూ.59.49 లక్షలు చెల్లిస్తోన్న ఏపీ సర్కారు, అనంతపురం నుంచి బయల్దేరే రైలు కోసం రూ. 42.67 లక్షలు వెచ్చిస్తోంది. కోచ్‌ల కోసం రూ.10 లక్షలు డిపాజిట్ చెల్లింది. ఇవన్నీ కలిపితే అక్షరాల 1.12కోట్లుగా ఉన్నా.. మిగిలిన ఖర్చులన్నీ కలిపి రూ.2కోట్లు దాటిపోతుంది. ఈ దీక్ష ఏర్పాట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ రూ. 2కోట్లను కేటాయించినట్లు సమాచారం. ధర్నాలో పాల్గొనేందుకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆ ఖర్చు వీటికి అదనం. సోమవారం ధర్నాలో పాల్గొన్న తర్వాత.. మరుసటి రోజు చంద్రబాబు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలుస్తారు.

 

సొంత మైలేజీ కోసం ప్రజాధనం ఖర్చు చేస్తున్న చంద్రబాబు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా, సీఎం హోదాలో దీక్ష చేపడితే.. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చనే బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని పదవి స్థాయి వ్యక్తితో ఢిల్లీలోనే  పోరాటానికి దిగితే లాభం చేకూరుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.