అన్నదాతకు అండగా : బెంగాల్‌లో కూడా రైతు బంధు

  • Published By: madhu ,Published On : December 31, 2018 / 03:13 PM IST
అన్నదాతకు అండగా : బెంగాల్‌లో కూడా రైతు బంధు

కోల్ కతా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తెలంగాణకు వచ్చి పథకాల రూపకల్పన..కార్యచరణలను పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా, రైతు బంధు పథకాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు చేసేందుకు సన్నద్ధమౌతున్నాయి. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ పథకాలపై ద‌ృష్టి సారించారంటే ఇది ఎంత సక్సెస్ అయ్యిందో చెప్పాల్సినవసరం లేదు. 

ఒడిశా..జార్ఖండ్ బాటలో వెస్ట్ బెంగాల్…
తాజాగా రైతు బీమా, రైతు బంధు పథకాలను తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని ఒడిశా, జార్ఖండ్ రాష్ర్టాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎకరానికి సంవత్సరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించేశారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులకు మరణిస్తే రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం సంబంధిత కుటుంబానికి అందజేస్తామని మమత స్పష్టం చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె పేర్కొన్నారు. 

తెలంగాణలో…
తెలంగాణలో రైతుబంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ. 8 వేల పెట్టుబడి చొప్పున ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పెట్టుబడి సాయాన్ని మరో రూ. 2 వేలు పెంచి మొత్తంగా సంవత్సరానికి రూ. 10 వేల పెట్టుబడి సాయం చేస్తామని కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో హామీనిచ్చారు..ఇవ్వడమే కాకుండా…రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నారు. రైతుబీమా కింద రూ. 5 లక్షల పరిహారాన్ని అందజేస్తున్నారు.