Driving license: డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీలో కీలకు మార్పులు.. ఇక ఆ సమస్య తప్పినట్టే
డ్రైవింగ్ లైసెన్స్(Driving license) వ్యాలిడిటీని ఏకంగా 50 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది.
Driving license validity increased to 50 years central government proposal
- లైసెన్స్ గడువు ఏకంగా యాభై ఏళ్లు
- కేంద్ర రవాణా శాఖ సరికొత్త ప్రతిపాదన
- వాహనదారులకు తప్పనున్న ఆర్టీవో తిప్పలు
Driving license: దేశంలోని కోట్లాది మంది వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన ప్రతిసారీ రెన్యూవల్ కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా కేంద్రం అడుగులు వేస్తోంది.
అందుకోసం, ఇప్పటివరకు 20 ఏళ్లుగా ఉన్న లైసెన్స్ వ్యాలిడిటీని ఏకంగా 50 సంవత్సరాలకు పెంచే భారీ ఊరటనిచ్చే ప్రతిపాదనపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది.
ఈ సరికొత్త విధానం వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు రవాణా శాఖ కార్యాలయాలపై పనిభారం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం లైసెన్స్ గడువు పెంపు మాత్రమే కాకుండా వాహన యాజమాన్య బదిలీ, వివిధ రకాల పర్మిట్ల పునరుద్ధరణ వంటి ఇతర కీలక రవాణా సేవలను కూడా వంద శాతం ఆన్లైన్ విధానంలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నట్లు రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా రంగ నిపుణులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై అధికారికంగా తుది ప్రకటన చేయనుంది. ఈ నూతన విధానాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటి నుండి అమలు చేస్తారనే దానికి సంబంధించి కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక గడువును ప్రకటించలేదు.
