కేరళ బంద్ హింసాత్మకం

కేరళ బంద్ హింసాత్మకంగా మారింది. గురువారం(జనవరి3) ఉదయం రాష్ట్రంలోని పలుచోట్ల బస్సులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. త్రిసూర్ లో దాదాపు 60 బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మరోవైపు కేరళకు వెళ్లే తమిళనాడు, కర్ణాటక ఆర్టీసీ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. మరోవైపు కోజికోడ్ లో బంద్ రోజు తెరిచి ఉన్న షాపులను బలవంతంగా మూయించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. కోజికోడ్ లో ఆందోళనకారులు వందల సంఖ్యలో షాపులపు ధ్వంసం చేశారు.
కోజికోడ్, కన్నూర్ లలో ఆందోళనకారులు రహదారిపై వాహనాలను బ్లాక్ చేసి టైర్లను కాల్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ జరిగిన అల్లర్లలో అనేక సీపీఎం ఆఫీసులు ధ్వంసమయ్యాయి. పాలక్కాడ్ జిల్లాలోని వెన్నకరలోని ఈఎమ్ఎస్ మెమోరియల్ లైబ్రరీ బిల్డింగ్ కు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. మలప్పురం, తవనూర్ లోని సీపీఎమ్ ఆఫీసులను కూడా తగులబెట్టారు. అయితే ఈ హింసకు బీజేపీ-ఆరెస్సెస్ కారణమంటూ సీఎం పిన్నరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో శాంతిని నాశనం చెయ్యాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.